Belagavi: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య మరోసారి ‘‘భాష’’, ‘‘సరిహద్దు’’ వివాదం రాజుకుంది. ఇటీవల కర్ణాటక సరిహద్దు జిల్లా బెళగావిలో మరాఠీ మాట్లాడలేదని కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు దాడి చేశారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. కర్ణాటకలోకి వచ్చిన మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు, డ్రైవర్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. ఒకరి బస్సులపై ఒకరు నినాదాలు రాశారు. దీంతో రెండు రాష్ట్రాలు కూడా బస్సు సర్వీసుల్ని రద్దు చేసుకున్నాయి.
అయితే, ఈ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ వివాదానికి కేంద్రంగా ‘‘బెళగావి’’ ప్రాంతం ఉంది. నిజానికి బెళగావి జిల్లా కర్ణాటకలో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో మరాఠీ మాట్లాడే వారే ఎక్కువ. మరాఠీ సంస్కృతి బెళగావి వ్యాప్తంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. మరోవైపు కర్ణాటక ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నారు. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరిగే సమయంలో ఈ వివాదం ఏర్పడింది. బెళగావి అనేది దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది.
మహారాష్ట్ర వాదన:
1960లో మహారాష్ట్ర ఏర్పడినప్పుడు సమయంలో, బెళగావి, నిపాని, కార్వార్‌తో సహా సరిహద్దుల్లోని 865 గ్రామాలను తమ భూభాగంలో కలపాలని, ఈ ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే వారు ఎక్కువ. అయితే, ఈ వాదనల్ని కర్ణాటక అడ్డుకుంది.
1966లో, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెహర్ చంద్ మహాజన్ నేతృత్వంలో మహాజన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించింది. బెలగావి విషయంలో కమిషన్ తీర్పు కర్ణాటకకు అనుకూలంగా ఉంది, కానీ ఇరు రాష్ట్రాల మధ్య రాజీని ప్రతిపాదించింది. మహారాష్ట్రలోని 247 గ్రామాలు (జాట్, అక్కల్‌కోట్, షోలాపూర్‌తో సహా) కర్ణాటకకు వెళ్లాలి, 264 గ్రామాలు (నిప్పాణి, ఖానాపూర్, నందగడ్‌తో సహా) మహారాష్ట్రకు బదిలీ చేయాలి. అయితే, ఈ రాజీ ఫార్ములాని మహారాష్ట్ర తిరస్కరించింది.
ఈ వివాదంలో మహారాష్ట్ర 2004లో సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కేసు పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం 2010లో, 1956 నాటి అసలు సరిహద్దు నిర్ణయాన్ని సమర్థించింది. ఇది ఏకపక్షం, తప్పు కాదని పేర్కొంది.
అధికారం చాటుకున్న కర్ణాటక:
ఈ వివాదం ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య ఫ్లాష్ పాయింట్‌గా ఉంది. కర్ణాటక తన అధికారాన్ని ధృడం చేసుకునేందుకు ‘‘బెల్గాం’’ పేరుని ‘‘బెళగావి’’గా మార్చింది. వార్షిక శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు ‘‘సువర్ణ విధాన సౌధ’’ని నిర్మించింది. దీనిని రెండో రాజధాని చేయాలని కర్ణాటక భావించింది.
తాజా వివాదాలు:
2022లో అప్పటి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కర్ణాటక బెళగావి మరాఠీ మాట్లాడే స్వాతంత్ర్య సమరయోధుల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించిన సందర్భంలో ఉద్రిక్తత నెలకొంది. దీనికి ప్రతిగా అప్పటి కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై మహారాష్ట్రలోని కన్నడ పాఠశాలలకు గ్రాంట్లు మంజూరు చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలోని జాట్ తాలూకాలోని 40 గ్రామాలను, సోలాపూర్‌లోని సరిహద్దు గ్రామాలను తన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని బొమ్మై ప్రకటించారు. అప్పుడు రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటం గమనార్హం.
డిసెంబర్ 27, 2022న, మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఈ వివాదంపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం, కర్ణాటకలోని బెల్గాం, నిప్పాణి, కార్వార్, బీదర్, భాల్కి నగరాలు మరియు మరాఠీ మాట్లాడే అన్ని గ్రామాలు మహారాష్ట్రలో అంతర్భాగంగా ఉన్నాయి.