Site icon NTV Telugu

Mahakumbh Mela 2025: నేటితో ముగియనున్న కుంభమేళా.. పవిత్ర స్నానాల కోసం పోటెత్తిన భక్తులు

Mahakumbh Mela

Mahakumbh Mela

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో ముగియనున్నది. జనవరి 13 (పౌష్ పూర్ణిమ)న ప్రారంభమైన కుంభమేళా నేడు మహాశివరాత్రితో(ఫిబ్రవరి 26) ముగియనున్నది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, దిగ్గజ వ్యాపారస్తులు, కుంభమేళాకు హాజరయ్యారు. దాదాపు 62 కోట్లకు పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.

Also Read:Bangladesh: యూనస్, పాక్ జోక్యంపై బంగ్లా ఆర్మీ చీఫ్ అసహనం.. తిరుగుబాటు తప్పదా..?

మహాకుంభమేళా కోసం యూపీ సర్కార్ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. ఇందుకోసం కోట్లు వెచ్చించింది. కాగా కుంభమేళా ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది. అయితే కుంభమేళాకు భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. స్వల్ప అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. మొత్తానికి మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆకర్షించింది.

Also Read:Eluru: శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి.. తమ్మిలేరులో ఇద్దరు గల్లంతు

బుధవారం మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. “హర్ హర్ మహాదేవ్” మంత్రోఛ్చారణలతో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 2 గంటల సమయానికి మహా శివరాత్రి నాడు 11.66 లక్షలకు పైగా భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేశారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తరువాతి రెండు గంటల్లోనే ఈ సంఖ్య 25.64 లక్షలకు పెరిగింది, ఉదయం 6 గంటల నాటికి 41.11 లక్షలకు పెరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ఒక్కరోజే 81.09 లక్షల మంది భక్తులు పవిత్రస్నానాలు చేశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహాకుంభమేళా ముగింపు రోజున భారత వైమానిక దళం మహాకుంభమేళా ప్రాంతంలో అద్భుతమైన వైమానిక ప్రదర్శనను నిర్వహించింది.

Exit mobile version