Madurai Tanishq Robbery Case: తనిష్క్లో బంగారం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. తమిళనాడులోని మదురైలో జరిగిన తనిష్క్ బంగారు ఆభరణాల దోపిడీ కేసు రాజకీయ రంగు పులుముకుంది. దోపిడీ ఘటనతో మొదలైన వివాదం క్రమంగా TVK (తమిళగ వెట్రి కళగం), NTK (నామ్ తమిళర్ కట్చి) పార్టీల మధ్య రాజకీయ పోరుగా మారింది. ముఖ్యంగా ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మీనాక్షికి TVKతో సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం తీవ్ర చర్చకు దారితీసింది.
మీనాక్షికి TVKతో సంబంధాలు..!
తనిష్క్ దోపిడీ కేసులో నిందితురాలిగా ఉన్న మీనాక్షి TVK నేత అని, ఆ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల ఆధారంగా TVKకు దోపిడీ నిందితులతో సంబంధాలున్నాయంటూ ప్రచారం సాగింది. అయితే వైరల్ అవుతున్న ఫొటోలు ఎడిట్ చేసినవని ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ ద్వారా వెల్లడైంది.. దీంతో ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
TVK ఫిర్యాదు.. యూట్యూబర్ అరెస్టు
మీనాక్షితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని TVK అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. NTKతో అనుబంధం ఉన్న యూట్యూబర్ సాటై దురైమురుగన్‌పై TVK కార్యకర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దురైమురుగన్ను అరెస్టు చేశారు. అయితే, యూట్యూబర్ దురైమురుగన్ అరెస్టుపై NTK నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా అంటూ ప్రభుత్వంపై, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పటికే దోపిడీ కేసుతో వేడెక్కిన పరిస్థితులు ఇప్పుడు రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదంగా మారాయి.
దోపిడీ కేసులో కీలక నిందితుల అరెస్టు
మరోవైపు తనిష్క్ దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.15 కోట్ల విలువైన 11.384 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి పాల్పడిన అసలు వ్యక్తులు ఎవరు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసులో అసలు దోపిడీకి పాల్పడినవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉండగా, మీనాక్షికి ఏ పార్టీతో సంబంధాలున్నాయనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, యూట్యూబర్ అరెస్టు వంటి పరిణామాలతో తనిష్క్ దోపిడీ కేసు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. మొత్తంగా ఒక బంగారు ఆభరణాల దోపిడీ కేసు కాస్తా TVK–NTK మధ్య సోషల్ మీడియా పొలిటికల్ వార్‌గా మారడం తమిళనాట హీట్ పెంచుతోంది..

