Bharatiya Janata Party: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ నేత చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల బాలికలతో మరుగుదొడ్లను శుభ్రం చేయించారని వార్తలు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు కూడా ఆదేశించారు. బాలికలతో మరుగుదొడ్లను కడిగించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. అయితే ఈ నేపథ్యంలో సేవా పఖ్‌వాడ కార్యక్రమంలో భాగంగా ఖత్‌ఖారీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా స్కూలులో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను శుభ్రం చేశారు.
అయితే బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా తాను మరుగుదొడ్లను కడిగిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడమే కాకుండా ప్రధాని మోదీ, జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి పార్టీ నేతలను ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రష్‌తో కాకుండా ఒట్టి చేతులతో బీజేపీ ఎంపీ మరుగుదొడ్లను శుభ్రం చేసిన విధానం చూస్తే కావాలనే ఆయన ఓవరాక్షన్ చేశారని పలువురు నెటిజన్‌లు మండిపడుతున్నారు. బీజేపీ ఎంపీ తన స్వహస్తాలతో మరుగుదొడ్డి కడగడం రాజకీయ స్టంట్ అని, స్కూల్ పిల్లలతో టాయిలెట్ క్లీనింగ్‌ను కప్పిపుచ్చేందుకు ఆయన ఇలా చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు. అటు బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా టాయిలెట్ క్లీన్ చేయడం ఇదే తొలిసారి కాదని… గతంలో కూడా ఎంపీగా ఉన్న సమయంలో రెండు సార్లు పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేసిన సంగతిని పలువురు గుర్తుచేస్తున్నారు.
https://twitter.com/Janardan_BJP/status/1572955219750699011
