NTV Telugu Site icon

Nupur Sharma: నుపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసుల లుకౌట్‌ నోటీస్‌

Nupur1

Nupur1

మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీచేశారు. కోల్‌కతాలో ఆమెపై ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన సంగతి తెలిసిందే. జూన్‌ 20వ తేదీనే నర్కెల్‌దంగ పోలీస్‌ స్టేషన్‌కి రావాలంటూ నుపుర్‌ శర్మకి సమన్లు కూడా జారీ అయ్యాయి. అమ్‌హెర్‌స్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సైతం గత నెల 25నే ఆమె హాజరుకావాల్సి ఉంది. కానీ ఆ రెండింటినీ నిందితురాలు బేఖాతరు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వస్తే తన ప్రాణానికే హాని అనే సాకుతో ఆమె తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో నుపుర్‌ శర్మ ఆచూకీ కోసం లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి.

మే నెలాఖరున ఆమె ఓ టీవీ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఖతార్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ తదితర 14 దేశాలు ఇండియాపై మండిపడ్డాయి. నుపుర్‌ శర్మ కామెంట్స్‌పై మన దేశంలోనూ భారీఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆమెను అరెస్ట్‌ చేయాల్సిందేనని ప్రజలు పెద్ద సంఖ్యలో డిమాండ్‌ చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసినందుకు నుపుర్‌ శర్మపై హైదరాబాద్‌, పుణె, ముంబైల్లో కేసులు నమోదయ్యాయి. బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయటంతో అధిష్టానం వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అయినా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నుపుర్‌శర్మ అనుచిత వ్యాఖ్యలు పరోక్షంగా ఇద్దరి హత్యకు దారితీశాయి. సుప్రీంకోర్టు సైతం నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.

ED: నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసిన ఈడీ