మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఊహించని కుదుపు ఎదురైంది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న మంత్రి, ఊహించని రీతిలో తిరుగుబాటు.. ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌కు పయనం.. అక్కడి నుంచి అస్సాంకు వెళ్లడం.. ఈ పరిణామాలతో మహా రాజకీయాలు వేడెక్కాయి. సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తును గందరగోళంలో పడేశాయి.మహారాష్ట్రలో సంక్షోభం నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం కానుంది. దీనికి హాజరుకానున్నారు ఏఐసీసీ పరిశీలకుడు కమల్ నాథ్.
శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు కీలక సూచనలు చేశారు మంత్రి, రెబల్ ఎమ్మెల్యేలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే.. శివసేన లైన్ ఎప్పుడూ హిందుత్వమేనంటూ స్పష్టం చేసిన థాక్రే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మక ద్రోహం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, తాను చేసిన తప్పేంటో చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు.. దీనిపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే.. "పార్టీ మనుగడ కోసం అసహజమైన ఫ్రంట్ నుండి బయటపడటం చాలా అవసరం"అని థాక్రేకు సూచించారు.
తనపై తిరుగుబాటు చేసిన శివసేన రెబల్స్, మంత్రి ఏక్‌నాథ్ షిండేను చర్చలకు ఆహ్వానించారు శివసేన పార్టీ చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, నేను నమ్మక ద్రోహానికి గురయ్యానంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. నాతో ఏక్‌నాథ్ షిండే నేరుగా మాట్లాడాలని సూచించారు.. ఇక, శివసేన సైనికుడు ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు అని వ్యాఖ్యానించారు.. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేను అని స్పష్టం చేశారు ఉద్దవ్ థాక్రే.
హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి, రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటానని ప్రకటించారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే.. సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ రాజకీయ సంక్షోభంపై మాట్లాడిన ఆయన.. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉందన్నారు.. ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధం, నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందన్నారు.. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, నేను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేశారు ఉద్దవ్ థాక్రే.
మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం సృష్టించిన శివసేన ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండే మీడియా ముందుకు రానున్నారు.. రాత్రి 7 గంటలకు ఆయన మీడితో మాట్లాడబోతున్నారు.. ఇప్పటికే ఏకనాథ్ షిండే తమ నాయకుడని ప్రకటిస్తూ రాష్ట్ర గవర్నర్, శాసనసభ ఉపాధ్యక్షుడికి లేఖ రాశారు 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, అంతేగాకుండా, ఏకనాధ్ షిండేను “శివసేన” శాసనసభాపక్ష నాయకుడుగా నియమిస్తూ తీర్మానం కూడా చేశారు.. సిద్ధాంతపరంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపడం పట్ల “శివసేన” కార్యకర్తల్లో విపరీతమైన అసంతృప్తి, వ్యతిరేకత వచ్చిందని తీర్మానంలో పేర్కొన్నారు..
మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. తమదే అసలైన శివసేన పార్టీ అంటూ 34 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాత్రి 7 గంటలకు రెబల్ ఎమ్మెల్యేల నేత ఏక్‌నాథ్ షిండే ప్రెస్‌మీట్ నిర్వహించి కీలక విషయాలను వెల్లడించనున్నారు.
మహారాష్ట్ర సంక్షోభంపై కాసేపట్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.. ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న మహారాష్ట్ర సీఎం థాక్రే.. ప్రభుత్వ సంక్షోభంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.. రాజకీయ సంక్షోభంతో శివసేన ఎమ్మెల్యేలు రెండుగా చీలిన విషయం తెలిసిందే కాగా.. తమదే అసలైన శివసేన అంటూ గవర్నర్‌కు 34 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు.. తమ నేతగా ఏక్‌నాథ్ షిండేను ఎన్నుకున్నారు రెబల్ ఎమ్మెల్యేలు.. గౌహతి క్యాంప్‌లో 34 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు.. దీంతో, చేసేది ఏమీ లేఖ సీఎం పదవి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.. కాసేపట్లో దీనిపై క్లారిటీ రాబోతోంది.
రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన మహారాష్ట్ర రాజకీయాల్లో కమరో ట్విస్ట్ వచ్చిచేరింది.. సీఎం ఉద్ధవ్‌థాక్రేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.. మరోవైపు ఇప్పటికే కరోనా మహమ్మారితో ఐసోలేషన్‌లో ఉన్నారు మహారాష్ట్ర గవర్నర్. దీంతో గోవా గవర్నర్‌కు మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.
మహారాష్ట్రలో సంక్షోభం కీలక దశకు చేరుకుంటోంది. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తోన్న తరుణంలో బీజేపీ అలర్ట్ అయింది. పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానం కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముంబయి దాటి వెళ్లొద్దని సూచించింది. ఒకవేళ, అఘాడీ కూటమి దిగిపోతే.. ఏక్‌నాథ్ షిండే మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
మహారాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుడు కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఎన్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తాయి. శరద్ పవార్‌తో నేను మాట్లాడాను. ఎన్‌సిపి ఎంవిఎకు మద్దతు ఉంటుంది... వేరే ఉద్దేశం లేదు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు శివాజీ మహారాజ్ రాష్ట్రాన్ని కలుషితం చేయరని నేను అనుకుంటున్నా అన్నారు కమల్ నాథ్.
ఈ సాయంత్రం జరిగే మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్చువల్‌గా పాల్గొంటారని, అనంతరం రాజీనామా ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షిండే శిబిరంలో 40 మంది ఎమ్మెల్యేలున్నట్లు తేలడంతో అసెంబ్లీలో అఘాడీ కూటమి మెజార్టీ మార్క్‌ను కోల్పోవడం దాదాపు ఖాయంగా కన్పించింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయడమే సమంజసమని శివసేన భావిస్తోంది. రెండేళ్ళ కంటే ముందే ప్రజాతీర్పు కోరితే బాగుంటుందని సేన అంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కూడా ఉద్ధవ్ కి కరోనా వచ్చిన విషయాన్ని ధ్రువీకరించారు. కరోనా కారణంగా ఉద్ధవ్ ఠాక్రేను తాను కలవలేకపోతున్నట్లు తెలిపారు. దీంతో ఆయన రాజీనామాపై సందిగ్ధత నెలకొంది.
మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సంక్షోభం వల్ల విధాన సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్‌లో తెలిపారు. రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చే సూచనలు కనిపించకపోవడం వల్ల అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు రౌత్ అభిప్రాయపడ్డారు. రౌత్ ట్వీట్‌తో మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
మహా రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో హోం ఐసోలేషన్ లో వున్నారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఇప్పటికే గవర్నర్ కి కరోనా సోకింది. గోవా గవర్నర్ కి మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. మరోవైపు .మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన కేబినెట్ భేటీపై ఉత్కంఠ ఏర్పడింది.
మహారాష్ట్రలో ఏర్పడిన సంక్షోభం శాసన సభ రద్దుకి దారితీస్తుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహా వికాస్ అఘాడీలో రెబల్స్ చిచ్చుపెట్టారు. దీంతో శివసేన ప్రభుత్వం మైనారిటీలో పడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంపులు చేసుకోవాలని రెబల్స్ అల్టిమేటం ఇస్తున్నారు. అయితే విధాన సభ రద్దుకి అవకాశం వుందని శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ మరింతగా వేడిని రాజేస్తోందని చెప్పాలి.
మహారాష్ట్ర రాజకీయాల్లో గంటగంటకో మలుపు చోటుచేసుకుంటోంది. తిరుగుబాటు బావుటా ఎగరేసి మంత్రి ఏక్‌నాథ్ షిండే తన మద్దతుదారులతో కలిసి అస్సాంలోని గౌహతికి వెళ్లిన విషయం తెలిసిందే. తనకు గల మద్దతుపై షిండే మాట్లాడారు. శివసేన పార్టీ 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది, ఆరుగురు స్వతంత్రుల మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. మొత్తం 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో అజయ్ చౌధురీని శివసేన ఎల్పీ నేతగా నియమించింది. ఈ సంక్షోభం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుండడంతో దీన్నుంచి బయటపడే మార్గాలు అన్వేషించేందుకు కాంగ్రెస్ నేతలు, క్యాబినెట్ మంత్రులు అయిన బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్, మరో మంత్రి, మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్.. ఠాక్రేను ఆయన నివాసంలో కలిసి చర్చించారు. అలాగే.. అసమ్మతి నేత షిండేతో చర్చలు జరిపేందుకు మిలింద్ నర్వేకర్, రవీంద్ర పాఠక్‌లను మహావికాస్ అఘాడీ నియమించింది. తనను పదవి నుంచి తొలగిస్తే ఎలా వుంటుందో చూపిస్తానని షిండే అంటున్నారు.
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై ట్వీట్ చేశారు సంజయ్ రౌత్. ఇది విధానసభ రద్దుకు దారి తీస్తోందంటూ ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ జట్టు వీడి.. తిరిగి బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏక్‌నాథ్ షిండ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కూటమిలోని ఇరు పార్టీలు ఈ సంక్షోభాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి..మహారాష్ట్రలో సంక్షోభం నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం కానుంది. దీనికి హాజరుకానున్నారు ఏఐసీసీ పరిశీలకుడు కమల్ నాథ్. ఇదిలా వుంటే..తిరుగుబాటు వెనుక బీజేపీ వుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇది శివసేన అంతర్గత అంశం అని శరద్ పవార్ అంటున్నారు. షిండే తిరుగుబాటుతో మాకు సంబంధం లేదని, ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన వస్తే వదిలిపెట్టం అంటోంది బీజేపీ. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్ష పెడితే నెగ్గడం కష్టమే! గవర్నర్ ఆస్పత్రిలో వుండడంతో ఈ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయోనని రాజకీయ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మహా రాజకీయం అసోంకి చేరిన సంగతి తెలిసిందే. అస్సాంలోని గౌహతి హోటల్‌లో తన మద్దతుదారులతో మకాం వేసిన శివ సేన రెబల్ గ్రూప్ సారధి ఏక్‌నాథ్ షిండేకు ఊహించని షాక్ తగిలింది. బుధవారం మధ్యాహ్నం ముంబైకి వెళ్లి.. మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కావాలని షిండే వర్గం అనుకుంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కరోనాతో ఆస్పత్రి పాలవడం ఆయన వర్గానికి షాకిచ్చింది. ఆయన కరోనాతో ఆస్పత్రి పాలవ్వడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి. ఎనభై ఏళ్ల కొష్యారి.. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో బుధవారం చేరారు.నిరంతరం మాస్క్‌లోనే కనిపించే ఆయన వైరస్ బారిన పడడం, అదీ షిండే భేటీ నేపథ్యానికి కంటే కాస్త ముందే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.