Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇద్దరు నిందితులు పార్లమెంట్‌లోకి విజిటర్లుగా ప్రవేశించి, హౌజులో పొగ డబ్బాలను పేల్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Volkswagen: ఇక “వోక్స్‌వాగన్” వంతు.. జనవరి 1 నుంచి 2 శాతం పెరుగనున్న కార్‌ల ధరలు..
అయితే ఈ కేసులో పార్లమెంట్లోకి ప్రవేశించిన నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు చేసింది తప్పు అని అంగీకరించారు. అతను సమాజానికి తప్పు చేసినట్లయితే అతడ్ని ‘‘ఉరితీయాలి’’ అని పేర్కొన్నారు. నా కొడుకు ఏదైనా మంచి పనిచేస్తే ప్రోత్సహిస్తాను, కానీ తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని నిందితుడు మనోరంజన్ తండ్రి దేవరాజ్ బుధవారం అన్నారు.
పార్లమెంట్‌పై 2001, డిసెంబర్ 13న ఉగ్రవాద దాడి జరిగింది. ఆ దాడిలో 5 ఉగ్రవాదులతో సహా, 15 మంది మరణించారు. ఈ దాడి జరిగి 22 ఏళ్లు గడుస్తున్నాయి. ఈ రోజే వీరమరణం పొందిన వారికి పార్లమెంట్ నివాళులు అర్పించింది. సరిగ్గా జీరో అవర్‌లో ఇద్దరు వ్యక్తుల పసుపు పొగను వెదజల్లే డబ్బాలు చేత పట్టుకుని లోక్‌సభ ఛాంబర్లోకి ప్రవేశించారు. ఎంపీలు వీరిద్దరి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు.
