Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అనే స్పష్టత వస్తుంది. ఇదిలా ఉంటే తాము ఒంటరిగానే అధికారంలోకి వస్తామని మరోసారి ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. పొత్తులపై ఊహాగానాలను తోసిపుచ్చారు. 224 మంది సభ్యుల అసెంబ్లీలో దాదాపు 150 సీట్లు గెలుస్తామని, మెజారిటీ మార్కు 113 కంటే ఎక్కువగా గెలుస్తామన్న పార్టీ అంచనాకు కట్టుబడి ఉన్నానని అన్నారు.
Read Also: CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. 93.12 శాతం ఉత్తీర్ణత
నా అంచనాలు మారవని, కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, మాకు పెద్ద నాయకులు బలం ఉంది, మా జాతీయ నాయకులు ప్రచారంలో సత్తా చాటారని అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని భావిస్తున్న జేడీఎస్, కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని ఆయన అన్నారు. బీజేపీ, జేడీఎస్ ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తుందనే దానిపై తాను వ్యాఖ్యానించనని అన్నారు. బీజేపీ, కుమారస్వామి మంతనాలు చేస్తే చేయనీయండి అంటూ, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.
దక్షిణాదిలో బీజేపీకి కంచుకోటగా కర్ణాటక రాష్ట్రం ఉంది. అయితే 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా గెలిచి మోడీ మ్యాజిక్ పనిచేయలేదని దేశానికి చెప్పాలని అనుకుంటోంది. అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తమ ఫలితాలను వెల్లడించాయి. కొన్ని మాత్రం బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తాయని చెబుతోంది. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత బీస్ యడియూరప్ప బీజేపీకి 115 కంటే ఎక్కవ సీట్లు వస్తాయని అంచానా వేశారు.