NTV Telugu Site icon

Leopard Attack: రెండేళ్ల చిన్నారిని చంపిన చిరుత.. వారం వ్యవధిలో మూడో ఘటన

Leopard

Leopard

Leopard Attack: గుజరాత్ రాష్ట్రాన్ని చిరుతపులుల దాడులు హడలెత్తిస్తున్నాయి. వరసగా మనుషులపై దాడులు చేస్తూ హతమార్చడమో, గాయపడటమో చేస్తున్నాయి. వారం వ్యవధిలో మూడు ఘటనలు జరగడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. అమ్రేలి జిల్లాలో రెండేళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసి చంపింది. శనివారం అర్థరాత్రి రాజుల రేంజ్ ఫారెస్ట్ పరిధిలోని కాటర్ గ్రామంలోని ఓ గుడిసెలో కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: Jagadish Shettar: “నా ఓటమికి కారణం అదే”.. కర్ణాటక మాజీ సీఎం వ్యాఖ్యలు..

చిరుతపులి బాలుడి మెడను కరుచుకుని పక్కనే పొలాల్లోకి తీసుకెళ్లింది. అయితే కుటుంబ సభ్యుల అరుపులతో చిరుత పిల్లాడిని అక్కడే పడేసి పారిపోయింది. మెడకు తీవ్రగాయాలైన చిన్నారిని మహువ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మ్యాన్ ఈటర్ గా మారిన ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇది సంచరించే ప్రాంతంలో బోనులను ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాల్లో ఉండే జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇదిలా ఉంటే వారం వ్యవధిలో అమ్రేలి జిల్లాలో మూడు ఘటనలు జరిగాయి. జిల్లాలోని సార్కుండ్ల తాలుకాలో కర్జాల గ్రామంలో సోమవారం చిరుతపులి దాడిలో మూడేళ్ల బాలుడు మరణించాడు. మంగళవారం లిలియా తాలూకాలోని ఖరా గ్రామ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో తన కుటుంబంతో కలిసి నిద్రిస్తున్న ఐదు నెలల బాలుడిని సింహాలు దాడి చేసి చంపేశాయి.