Site icon NTV Telugu

Lawyer Fight For Justice: రూ.20 కోసం 22 ఏళ్ల పాటు పోరాడిన న్యాయవాది.. చివరకు ఎంత దక్కిందంటే..?

Lawyer Justice

Lawyer Justice

Lawyer Fight For Justice: డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి… రూపాయి ఉచితంగా వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. మరి మన డబ్బులు మనం సాధించుకోవడంలో పోరాటం చేస్తే తప్పేముంది. ఓ న్యాయవాది కూడా ఇలాగే ఆలోచించాడు. వివరాల్లోకి వెళ్తే.. తుంగనాథ్ చతుర్వేది అనే లాయర్ 1999లో ఉత్తరప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ స్టేషన్‌లో తనతో పాటు మరో వ్యక్తి కోసం రూ.70కి రెండు రైలు టికెట్లు కొన్నాడు. టిక్కెట్ ధర ఒక్కొక్కటి రూ.35. అయితే చతుర్వేది రూ.100 ఇవ్వగా టిక్కెట్ కౌంటర్‌లో పనిచేసే క్లర్క్ రూ.10 మాత్రమే రిటర్న్ ఇచ్చాడు. రూ.20 ఇవ్వలేదు. తనకు మిగతా డబ్బులు ఇవ్వాలని చతుర్వేది మొత్తుకున్నా క్లర్క్ వినిపించుకోలేదు. ఇంతలో రైలు రావడంతో చతుర్వేది వెళ్లిపోయాడు.

Read Also: Asteroids : భూమిపైకి ఆస్టరాయిడ్ల దండయాత్ర.. ఏ క్షణమైనా..

కానీ తనకు రావాల్సిన రూ.20 కోసం లాయర్ చతుర్వేది వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధించి100 సార్లకు పైగా కోర్టు మెట్లెక్కాడు. తాజాగా ఈ కేసులో వినియోగదారుల న్యాయస్థానం చతుర్వేదికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. చతుర్వేదికి రూ.15 వేలు ఇవ్వాలని కోర్టు రైల్వే శాఖను ఆదేశించింది. అదనంగా వసూలు చేసిన రూ.20కి 1999 నుంచి 2022 వరకు ఏడాదికి 12% చొప్పున వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల నిర్ధిష్ట సమయంలో ఈ నగదును చెల్లించకపోతే 15 శాతంతో వడ్డీతో చెల్లించాలని కోర్టు హెచ్చరించింది. కాగా ఈ కేసులో తనకు లభించిన పరిహారం చాలా తక్కువ అని చతుర్వేది ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తీర్పు తనకు కలిగించిన మానసిక వేదనను తీర్చలేదని చతుర్వేది వాపోయాడు.

Exit mobile version