NTV Telugu Site icon

Kiren Rijiju: జడ్జిలది కాదు.. వ్యవస్థదే తప్పు.. పెండింగ్ కేసులపై న్యాయశాఖ మంత్రి..

Kiren Rijiju

Kiren Rijiju

Kiren Rijiju comments on pending cases: దేశంలో పెరుగుతున్న కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయమూర్తుల తప్పు కాదని.. వ్యవస్థ తప్పు అని ఆయన అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలను చేస్తోందని అన్నారు. అనవసరమైన, వాడుకలోని చట్టాలను రద్దు చేయడం, కోర్టులో మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంకేతికను వాడటం వంటివి చేస్తూ మెరుగైన వ్యవస్థ వైపే వెళ్తున్నామని అన్నారు.

ఉదయ్‌పూర్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా: ఎవల్యూషన్ అండ్ లీగల్ పెర్స్‌పెక్టివ్’ అనే అంశంపై జరిగిన సదస్సులో శనివారం మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం 4.90 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని అన్నారు . ఏ దేశంలో లేదా సమాజంలో ఇన్ని కేసులు పెండింగ్‌లో ఉండటం మంచిది కాదని ఆయన అన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. న్యాయమూర్తుల పరిస్థితి దారుణంగా ఉందని, ఒక న్యాయమూర్తి ఒక్క రోజులో 50-60 కేసులు పరిష్కరిస్తారని, వారు రోజు కేసులు పరిష్కరిస్తుంటారు, అయితే వచ్చే కేసులు రోజు రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయని అన్నారు.

Read Also: Earthquake: జపాన్‌లో భూకంపం..

కేసులు పెండింగ్ ఎందుకు ఉంటాయని సామాన్యులు అడుగుతుంటారు, అయితే ఒక న్యాయమూర్తి దీని వెనక ఎంత పనిచేస్తారో ప్రజలకు తెలియదని, ఇది న్యాయమూర్తి తప్పు కాదని, వ్యవస్థ తప్పు అని అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి టెక్నాలజీ కీలకం అని, పేపర్ లేస్ గా చేయడానికి దేశవ్యాప్తంగా న్యాయస్థానాలను సాంకేతికతతో సన్నద్ధం చేస్తామని ఆయన అన్నారు. హైకోర్టులు, దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లలో సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని.. ఇప్పటికే కొన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపడుతున్నాయని.. ఇది మంచి విషయం అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థను కాగిత రహితంగా మార్చడము ఇందులో భాగమే అని అన్నారు. ఇది పర్యవరణ పరంగా మేలు చేస్తుందని, గ్రీన్ ఎనర్జీ విషయంలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉందని, ప్రధాని మోదీ ముందు చూపే ఇందుకు కారణం అని అన్నారు.