NTV Telugu Site icon

Rs.2000 note exchange: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు.. ప్రకటించిన ఆర్బీఐ

Rs.2000 Notes

Rs.2000 Notes

Breaking News: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ రోజు ప్రకటించింది. సెప్టెంబర్ 30తో నోట్ల మార్పిడికి తుది గడువు ముగిసింది. అయితే బ్యాంకుల్లో రూ. 2000 నోట్లను మార్పిడి చేసుకునే గడువును అక్టోబర్ 7 వరకు పొడగించినట్లు వెల్లడించింది. రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ కోసం ముందుగా పేర్కొన్న వ్యవధి ముగిసినందున, రూ. 2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం ప్రస్తుత ఏర్పాటును అక్టోబర్ 07, 2023 వరకు పొడగించాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

గడువు ముగిసిన తర్వాత కూడా రూ.2000 నోటు చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 8 నుంచి బ్యాంకులు రూ. 2000 నోట్ల మార్పిడిని నిలిపేస్తాయి. అయితే ఆర్బీఐ 19 కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. నోట్లను ఇండియా పోస్టు ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు.

మే 19 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లలో రూ.3.42 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లను తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 29 నుంచి రూ. 0.14 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 96 శాతం తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది.