ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే లాలూ ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం ఉదయం ఆయన్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం మళ్లీ లాలూ ఆరోగ్యం విషమించడంతో మరోసారి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి ఆయన్ను తరలించినట్లు లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మీడియాకు వెల్లడించారు. లాలూ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో లాలూ జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండటంతో మంగళవారం ఆయన్ను బిర్సాముండా సెంట్రల్ జైలు నుంచి హుటాహుటిన రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకువెళ్లారు. మంగళవారం రాంచీలో చికిత్స పొందుతున్న సమయంలో ఇన్ఫెక్షన్ స్థాయి 4.5 గా ఉందని.. అనంతరం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో పరీక్షించినప్పడు అది 5.1కు పెరిగిందని తేజస్వీ యాదవ్ తెలిపారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం పరీక్షించినప్పడు ఇన్ఫెక్షన్ స్థాయి 5.9కు చేరుకుందని వెల్లడించారు.
