ప్రముఖ ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ నటి సంచితా ఉగలే (22) అకాల మరణం చెందింది. మహారాష్ట్రలోని నలసోపారాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవల తెలుగు నటి ట్విషా శర్మ మరణం మరువక ముందే మరో నటి హఠాత్తు మరణం చెందడంతో టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే సంచితా ఉగలే మరణానికి ఇంకా కారణాలు తెలియలేదు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల మధ్య చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యలు ధృవీకరించారు. దీంతో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. బాధితురాలి తండ్రి మచింద్ర ఉగలే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంచితా ఉగలే టెలివిజన్ రంగంలో మంచి పేరు సంపాదించుకుంది. చాలా కాలంగా ప్రసారం అవుతోన్న ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లో దియా టాండన్ పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్‌తోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇంతలోనే అకాల మరణం చెందడంతో సహచరులు, శ్రేయోభిలాషులంతా దు:ఖంలో మునిగిపోయారు. ఇక విక్కీ కౌశల్ ‘చావా’ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది.
ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి తరలించారు. నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అచోలే పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వినోద్ బాగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సంచితా తన పడకగదిలో తాళం వేసుకుని చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను వసాయి-విరార్ మున్సిపల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. అయితే మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని..తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

