Site icon NTV Telugu

నక్క తోక తొక్కిన పెయింటర్.. లాటరీలో రూ.12 కోట్ల జాక్‌పాట్

కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను అదృష్టం లాటరీ రూపంలో వరించింది. దీంతో సదరు పెయింటర్ లాటరీలో ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… కొట్టాయం ప్రాంతానికి చెందిన సదానందన్ అనే వ్యక్తి 50 ఏళ్లుగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బతకడానికి అనేక అప్పులు చేసిన క్రమంలో వాటిని తీర్చేందుకు ఓ లాటరీ టిక్కెట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో క్రిస్మస్-న్యూఇయర్ సందర్భంగా కొట్టాయంలోని బెంజ్ లాటరీస్ ఏజెన్సీకి చెందిన లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. లాటరీ విజేతలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందే సదానందన్ ఆ టిక్కెట్ కొనుగోలు చేశాడు.

Read Also: విషాదం… టీకా వికటించి ముగ్గురు చిన్నారులు మృతి

అయితే ఆ టిక్కెట్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిన కాసేపటికే తాను రూ.12 కోట్లు గెలుచుకున్నట్లు లాటరీ సంస్థ సమాచారం ఇవ్వడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. లాటరీ టిక్కెట్ నంబర్ XG 218582కు రూ.12 కోట్లు వచ్చాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈ లాటరీలో మొదటి బహుమతిగా రూ.12 కోట్లు కాగా రెండో బహుమతిగా రూ.3 కోట్లు (ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు), మూడో బహుమతిగా రూ.60 లక్షలు (ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు) అందజేయనున్నారు. కాగా లాటరీలో వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగిస్తానని సదానందన్ తెలిపాడు.

Exit mobile version