NTV Telugu Site icon

Kolkata Doctor Case: సీఎం మమతా బెనర్జీ.. న్యాయం చేయాల్సిందిపోయి, న్యాయం కోసం రోడెక్కింది.. ఇదే విచిత్రం..

Mamata Banerjee

Mamata Banerjee

Kolkata Doctor Case: కోల్‌కతా లేడీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలను రాజేసింది. ప్రభుత్వ ఆధీనంలోని నగరం నడిబొడ్డున ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలు అత్యంత పాశవికంగా రేప్, హత్యకు గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా మెడికోలు, మహిళలు, సాధారణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీరు, పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు సీబీఐకి కేసుని బదిలీ చేసింది.

ఇదిలా ఉంటే, ఈ రోజు(శుక్రవారం) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ చేపట్టారు. వైద్యురాలికి మద్దతు నిరసన తెలుపుతున్న సమయంలో కొందరు దుండగులు ఆస్పత్రిలోకి చొరబడి దాడి చేశారు. దీనిని ఈ రోజు విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రోజే మమతా ఈ ర్యాలీ చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ, సీపీఎంలు దీనిని చౌకబారు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

ఇక్కడ విచిత్రం ఏంటంటే, పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, న్యాయం కోసం రోడ్డెక్కడం విచిత్రంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొదటి నుంచి ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వారు మమతాపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి ఆదివారం లోగా నిందితులను కనిపెట్టాలని ఆమె అల్టిమేటం జారీ చేయడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ నేత సుధాన్షు త్రివేది స్పందిస్తూ.. సీబీఐకి 70 సెకన్లలో కేసును హ్యాండ్ ఓవర్ చేసి, 7 రోజుల అల్టిమేటం ఇవ్వడంపై ఆయన విమర్శలు గుప్పించారు.

Read Also: KTR : రూ.40 వేల కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పి మాఫీ చేసిందెంత.?

ప్రతిపక్షాల మౌనం:

బాధితురాలికి మద్దతు నిలవడంపై ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా చూడకూడదు. కానీ కోల్‌కతా డాక్టర్ ఘటన విషయంలో మాత్రం ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి సరైన స్పందన రాకపోవడం గమనార్హం. ఇండియా కూటమిలో మమతా బెనర్జీ భాగంగా ఉండటమే ఇందుకు కారణమా..? అనేది వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ చిన్న ఘటన జరిగినా కూడా కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆప్, టీఎంసీ ఇలా ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడేవి. కానీ ఈ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

ఘటన జరిగిన నాలుగైదు రోజుల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ స్పందించారు. బాధితురాలికి సరైన న్యాయం చేయాలని సుతిమెత్తగా చెప్పారు. మిగతా పార్టీలు కూడా ఈ కేసును పెద్ద అంశంగా చూడటం లేదు. దేశవ్యాప్తంగా మెడికోలు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నా కూడా ఈ అంశాన్ని పెద్దగా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనలో సమాజ్‌వాదీ పార్టీ నేత ఉండటం, మరో మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో కూడా అదే పార్టీకి చెందిన నేత ఉండటంతో కాంగ్రెస్ సహా, ఇతర ప్రధాన ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి. సెలెక్టివ్‌గా అంశాలపై స్పందించడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు.