NTV Telugu Site icon

Kolkata Doctor Murder Case: కోల్‌కతా హస్పటల్ విధ్వంసం.. ఇద్దరు ఏసీపీలు, ఓ ఎస్ఐ సస్పెన్షన్‌..!

Kol

Kol

Kolkata Doctor Murder Case: కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్ పై హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్‌ ఆసుపత్రిలో గత బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆ టైంలో విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను కోల్‌కతా పోలీసు విభాగం ఇవాళ (ఆగస్ట్ 21) సస్పెండ్‌ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఘటన జరిగిన టైంలో హస్పటల్ దగ్గర విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్‌పైన వేటు పడింది.

Read Also: Rajnikanth: వైజాగ్ లో కూలీకి 160 ఇచ్చిన తలైవా రజనీకాంత్..

కాగా, హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా ఆందోళనలు తెలుపుతుంటే.. మరోవైపు ముసుగులు ధరించిన కొందరు విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు జరిపారు. అత్యవసర గది, నర్సింగ్‌ స్టేషన్, మందుల దుకాణం, ఔట్‌ పేషంట్‌ విభాగాలతో పాటు సీసీ టీవీలను కూడా పగలకొట్టారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటి వరకూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సుమారు 40 మంది నిరసనకారుల రూపంలో అర్థరాత్రి వచ్చిన దుండగులు ఆసుపత్రిలో ఈ విధ్వంసం సృష్టించారు.. వీరి దాడిలో ఓ పోలీసు వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పోలీసులు వెల్లడించారు.

Read Also: Barack Obama: ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్‌ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు..

ఇక, ఈ విధ్వంసాన్ని నిలువరించటంలో పోలీసుల పాత్రపై సుప్రీంకోర్టు మంగళవారం జరిగిన విచారణలో పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఘటన జరిగిన సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆ టైంలో అక్కడే నిరసన తెలియజేస్తున్న వైద్య విద్యార్థులు, జూనియర్‌ డాక్టర్లు ఆరోపణలు చేశారు. కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ కుమార్‌ గోయల్‌ సైతం తమవైపు తప్పు జరిగిందని మరుసటిరోజే తెలిపారు. దాడుల్లో పోలీసులు సైతం గాయపడ్డారని.. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారతాయని అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యామని చెప్పుకొచ్చారు.