Killer Plant Fungus: ప్రపంచంలో అత్యంత అరుదుగా మొక్కల్లో సోకే ఫంగస్ మనుషులను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తిలో కనుక్కున్నారు. మొక్కలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఈ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శిలీంధ్రం ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తి మొక్కలకు వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే ప్లాంట్ మైకాలజిస్ట్. మొక్కల శిలీంధ్రాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే సదరు వ్యక్తికి శిలీంద్రం ఇన్ఫెక్షన్ సోకింది.
మెడికల్ మైకాలజీ కేస్ రిపోర్ట్స్ అనే జర్నల్ లో ఈ ఫంగస్ వ్యాధికి గురైన వ్యక్తి కేస్ స్టడీని వివరించారు. గుర్తుతెలియని వ్యాధి సోకిన 61 ఏళ్ల వ్యక్తికి గొంతు బొంగురుపోవడంతో పాటు దగ్గు, అలసట, మూడు నెలల నుంచి ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కోల్ కతాలోని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే బాధిత వ్యక్తికి షుగర్, హెచ్ఐవీ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల వ్యాధి, మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు లేవు. అనారోగ్యానికి గురైన వ్యక్తి మొక్కలు, కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, మొక్కలకు వచ్చే వివిధ రకాల శిలీంద్రాలపై పనిచేస్తుంటారు.
Read Also: April Fools’ Day: ఏప్రిల్ ఫూల్స్ డే.. అసలు ఎలా పుట్టింది..? దాని వెనక ఉన్న కథేంటి..?
కోల్‌కతాలోని కన్సల్టెంట్ అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకులు, డాక్టర్ సోమా దత్తా మరియు డాక్టర్ ఉజ్వాయిని రే దీనిపై సృష్టిసారించారు. ‘‘కొండ్రోస్టీరియం పర్పురియం’’ అనే మొక్కల్లో వచ్చే శిలీంధ్రం సదరు వ్యక్తికి వ్యాధిని కలిగించినట్లు తేలింది. ఇది గులాబీ కుటుంబం మొక్కల్లో వెండి ఆకు వ్యాధిని కలిగిస్తుంది. ఇలా మొక్కలకు వచ్చే ఓ ఫంగస్ మానవుడిలో వ్యాధికి కారణం అవడం ఇదే తొలిసారి. అయితే దీన్ని సంప్రదాయ పద్దతులైన మైక్రోస్కోపి, కల్చర్ ద్వారా గుర్తించలేము. సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే ఈ అసాధారణ వ్యాధిని కనుక్కోవచ్చు.
ఈ ఫంగస్ వ్యాధికి గురైన వ్యక్తి మెడ వద్ద ఉన్న గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించి, యాంటీ ఫంగల్ మందులను వైద్యులు రాశారు. అయితే రెండు ఏళ్లుగా సదరు వ్యక్తి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తూ ఉన్నారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అతడిలో కనిపించకపోవడంతో పూర్తిగా కోలుకున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.