MLA VS Babu De*ath Mystery: కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు మృతిపై అనుమానాలు.. తెరపైకి సంచలన ఆరోపణలు

Mla Vs Babu

Mla Vs Babu

MLA VS Babu De*ath Mystery: తమిళనాడులోని కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు మృతి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరపాలంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే మరణంలో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారుడు కోరడం చర్చనీయాంశంగా మారింది. కొలత్తూరు నియోజకవర్గ పరిధిలోని చెంబియానికి చెందిన న్యాయవాది గుమస్తా జి. దేవరాజన్ ఈ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వీఎస్ బాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ వేసిన మరుసటి రోజే వీఎస్ బాబు మరణించినట్లు ఆసుపత్రి ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం చేసిన దేవరాజన్ పోలీసులకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

చికిత్స వివరాలు భద్రపరచాలని విజ్ఞప్తి
వీఎస్ బాబు మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. ఆయనకు అందించిన వైద్య చికిత్స వివరాలు, మెడికల్ రికార్డులు, ఇతర వైద్యపరమైన డాక్యుమెంట్లను భద్రపరచాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణాన్ని కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే మృతదేహం ముఖంపై మార్పులపై అనుమానాలు
మరోవైపు వీఎస్ బాబు భౌతికకాయం ముఖంపై కనిపించిన మార్పులపై డీఎంకే పర్యావరణ విభాగం రాష్ట్ర ఉపకార్యదర్శి డాక్టర్ షఫీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన పోస్టు చర్చకు దారితీసింది. ఎంజీఎం ఆసుపత్రి లేదా టీవీకే వర్గాలు ఏదో కీలక విషయాన్ని దాస్తున్నాయనే అనుమానాన్ని ఆయన తన పోస్టులో వ్యక్తం చేశారు. చాలా రోజుల క్రితం మరణించిన మృతదేహాల్లో కనిపించే కొన్ని శారీరక మార్పులు వీఎస్ బాబు ముఖంపై కూడా కనిపిస్తున్నాయని డాక్టర్ షఫీ పేర్కొన్నారు. రక్తం గడ్డకట్టడం, పాత గాయాల కారణంగా చర్మంపై మరకలు ఏర్పడటం, చర్మం పాలిపోవడం, పెదాలు ఎండిపోవడం, ముఖంపై ఊదా, బూడిద లేదా ముదురు రంగు మచ్చలు కనిపించడం వంటి మార్పులను ఆయన ప్రస్తావించారు. అలాగే ఫ్లూయిడ్ ఇన్ఫ్యూజన్ చేయడం వల్లే ముఖంలో ఇలాంటి ఉబ్బుదల (Facial Fullness), చిన్న రంధ్రాలు కనిపించే అవకాశం ఉందంటూ తన పోస్టులో ఆరోపణలు చేశారు.

సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చ
వీఎస్ బాబు భౌతికకాయం తీరుపై డాక్టర్ షఫీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పలువురు నెటిజన్లు కూడా మృతదేహం ముఖంపై కనిపించిన మార్పులపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మరణానికి సంబంధించిన పూర్తి వైద్య వివరాలు, అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు, అధికారిక ప్రకటనలతోనే ఈ వ్యవహారంపై నెలకొన్న అనుమానాలకు సమాధానం లభించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల ఎన్నికల్లో టీవీకే తరఫున కొలత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వీఎస్ బాబు (75).. డీఎంకే చీఫ్‌, మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించి వార్తల్లో నిలిచారు.. అయితే ఆయన ఈ నెల 19న చెన్నైలోని ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందారు.. ఇప్పుడు ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది..