General election-2024: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు డిసెంబర్ 21న కాంగ్రెస్ కీలక భేటీకి పిలుపునిచ్చింది. బీజేపీని ఢీకొట్టేందుకు, ఎన్నికల ప్రచారాన్ని రంగంలోకి దించేందుకు ప్రణాళికలను రూపొందించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. డిసెంబర్ 19న ఇండియా కూటమి సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ భేటీ కానుంది. ఇండియా కూటమి సమావేశంలో రాజకీయ పార్టీల మధ్య సీట్ల పంపకం, ప్రచారం ఎజెండా గురించి చర్చించనున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధానాంశాలుగా 2024 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మరోసారి యాత్ర నిర్వహించే విషయంపై డిసెంబర్ 21 సమావేశంలో చర్చించనున్నారు.
గతేడాది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’ సక్సెస్ అయింది. అయితే లోక్ సభ ఎన్నికల ముందు ఈసారి తూర్పు నుంచి పశ్చిమం వైపు హైబ్రీడ్ మోడ్‌లో యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం తెలంగాణలో మాత్రమే అధికారం దక్కించుకుంది. ఈ సమావేశంలో ఓటమి అంశాలను కూడా విశ్లేషించనుంది.
