Ketan Agarwal Murder Case: కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలకు పూణే కోర్టు గురువారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత ఇద్దరిని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏంఎం విబూతే ఎదుట హాజరుపరిచారు. నిందితుల ఇద్దరి మొబైళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న డేటాలో కోడ్ వర్డ్స్, కోడ్ భాషలో మాట్లాడుకున్నారని, వీటిని అర్థం చేసుకోవడానికి ఇద్దరి పోలీస్ కస్టడీ మరో 3 రోజులు పొడగించాలని ప్రాసిక్యూషన్ కోరింది.
ఈ కేసు దర్యాప్తు చేయడానికి పోలీసులకు ఇప్పటికే తగినంత సమయం ఇచ్చారని, తదుపరి కస్టడీ విచారణ అనవసరమని వాదిస్తూ నిందితుల తరుఫున న్యాయవాది ఈ అభ్యర్థనను వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనల్ని విన్న తర్వాత ప్రాసిక్యూషన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఇద్దరిని జూలై 16 వరకు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.
జూన్ 18న కేతన్ అగర్వాల్ హత్య జరిగింది. పూణేలో సంపన్న కుటుంబానికి చెందిన కేతన్‌ను కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్‌లు కలిసి లోహ్‌గఢ్ కోట పైనుంచి తోసేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ హత్యకు ముందు జూన్ 14న ఇలాగే తోసేందుకు ప్రయత్నించి సియా విఫలమైంది. చివరకు జూన్ 18న హత్యకు పక్కాగా ప్లాన్ చేసి అమలు చేసింది.

