Kerala Woman: కేరళలో ఇటీవల బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో, ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై నిందలు రావడంతో 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. ఈ వీడియోకు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత, మానసికంగా కుంగిపోయిన దీపక్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి తీరును అంతా ఖండించారు. కేవలం వ్యూస్ కోసం ఇంతలా దిగజారాలా.? ఒక వ్యక్తి ప్రాణాలు పోయేలా ప్రవర్తించాలా అని ప్రజలు యువతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారం పెద్దది కావడంతో నిందితురాలు షింజితా ముస్తాఫాను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడం, దీపక్ ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ఆమె పరారీలో ఉంది. ఆమెను కోజికోడ్‌లోని బంధువుల నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె కేరళ దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీపక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ముస్తఫా వైరల్ వీడియోను పంచుకున్న తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి. నాన్ బెయిలబుల్ నేరం మోపిన తర్వాత పోలీసులు ఆమె గురించి రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేశారు. దేశం విడిచి పెట్టకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
