Kerala ragging horror: కేరళలో ర్యాగింగ్ భూతం పరాకాష్టకు చేరుకుంది. ఇటీవల ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొట్టాయం జిల్లాలోని ఒక నర్సింగ్ కాలేజీలో ఐదుగురు విద్యార్థులు తమ జూనియర్లను దారుణంగా ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలోని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు శామ్యూల్ జాన్సన్, ఎన్ఎస్ జీవా, కెపి రాహుల్ రాజ్, సి రిజిల్ జిత్, వివేక్ ఎన్పిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Kingdom Teaser : అలసట లేని భీకర యుద్ధం.. ఎన్టీఆర్ మాటల్లో దేవరకొండ సినిమా టీజర్
పోలీసులు కథనం ప్రకారం.. సీనియర్లు నవంబర్ 2024 నుంచి ర్యాగింగ్ పేరుతో ఫస్ట్ ఇయర్ నర్సింగ్ విద్యార్థుల్ని వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక ముగ్గురు విద్యార్థులు సమీపంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు, బాధిత విద్యార్థుల శరీరంపై కోసిన గాయాలు ఉన్నాయి. శరీరాలపై గాయాలు చేసి, ఆ తర్వాత వాటిపై లోషన్ పోసేవారని పోలీసులు తెలిపారు. బాధితులు నొప్పిని తట్టుకోలేక ఏడిచే క్రమంలో, నిందితులు వారి నోటికి, శరీర భాగాలకు క్రీములు రాసేవారు. విద్యార్థుల్ని నగ్నంగా చేసి, వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు కంపాస్ వంటి వాటిని ఉపయోగించి గాయపరిచేవారని తెలిసింది.
ర్యాగింగ్‌తో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థుల్ని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేసిన తర్వాత, కళాశాల ప్రిన్సిపాల్ ఈ చర్య తీసుకున్నారు. ర్యాగింగ్ గురించి విద్యార్థులు కళాశాలకు తెలియజేయలేదని ప్రిన్సిపాల్-ఇన్‌చార్జ్ డాక్టర్ లిని జోసెఫ్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పడుతున్న బాధల గురించి క్లాస్ టీచర్‌కి తెలియజేయడంతో ఫిర్యాదు నమోదైంది.