కేరళ ముఖ్యమంత్రి సతీశన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను హత్య చేస్తానంటూ ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తిరువనంతపురం సిటీ జిల్లా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (DPCC)కు శుక్రవారం సాయంత్రం సుమారు 6:50 గంటల సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ హెచ్చరించాడు. అతని ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. ‘నాకు సతీశన్ అంటే ఇష్టం లేదు’ అని సమాధానం ఇచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కొద్ది నిమిషాల తర్వాత సాయంత్రం 6:53 గంటలకు మళ్లీ ఫోన్ చేసి అదే బెదిరింపులను పునరావృతం చేశాడని పోలీసులు తెలిపారు.
పోలీసులను దూషించిన నిందితుడు
రెండోసారి ఫోన్ చేసిన సమయంలో కాల్ లిఫ్ట్ చేసిన పోలీసు అధికారిని దూషించడమే కాకుండా, ముఖ్యమంత్రికి తగిన భద్రత కల్పించారా లేదా అని ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫోన్ కాల్స్ నేపథ్యంలో కాంటోన్మెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ జరిపి.. అట్టింగల్‌కు చెందిన సోనీ థామస్ అనే వ్యక్తిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో బెదిరింపులు
ప్రాథమిక విచారణలో నిందితుడు మద్యం మత్తులో ఉన్న సమయంలోనే ఈ బెదిరింపు కాల్స్ చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు పంపే ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యేకు కూడా బెదిరింపులు
ఇదిలా ఉండగా కన్నూర్ జిల్లాలోని మయ్యిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదైంది. తలిపరంబా ఎమ్మెల్యే టి.కె. గోవిందన్‌కు కూడా ఫోన్ ద్వారా చంపేస్తానంటూ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 4 గంటలకు వచ్చిన ఫోన్ కాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యేను దూషిస్తూ ప్రాణహాని హెచ్చరికలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించినట్లు, అతనిపై కూడా చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

