Kerala Man Arrested For Thrashing Wife Who Refused To Quit Her Job: ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ఉద్యోగం చేసే అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనలో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేరళకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్య ఉద్యోగం మానేయడం లేదని తీవ్రంగా దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను కొట్టడమే కాకుండా.. ఆ వీడియోను చిత్రీకరించాడు సదరు వ్యక్తి. ఇది ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో బుధవారం 27 ఏళ్ల దిలీప్ ను అరెస్ట్ చేశారు మలైంకీజు పోలీసులు. తిరువనంతపురానికి చెందిన దిలీప్ తన భార్య ఉద్యోగానికి వెళ్లకూడదని పలుమార్లు ఆదేశించాడు. అయితే భర్త మాటను కాదని భార్య సూపర్ మార్కెట్ లో పనికి వెళ్తోంది. అప్పు తీర్చాలంటే పనికి వెళ్లాలి కదా అని భార్య చెబుతున్నా వినకుండా తీవ్రంగా దాడి చేశాడు.
Read Also: Deepavali : 24నే దీపావళి జరుపుకోవాలి.. ఎందుకంటే?
మహిళపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె ముఖం నుంచి రక్తం కారింది. దిలీప్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్న దిలీప్, భార్యను తీవ్రంగా కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఉద్యోగం చేయకపోతే పిల్లలు ఆకలితో అలమటిస్తారని భార్య, భర్తకు చెబుతుంది. అయినా అతను వినిపించుకోకుండా దాడి చేస్తాడు. చివరకు సదరు మహిళ తన ఉద్యోగాన్ని వదులుకునేందుకు ఒప్పుకుంటుంది. ఈ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించడంతో, ఇది మహిళ స్నేహితుల దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరిది ప్రేమ వివాహం, ఇరు కుటుంబాలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల బాలుడితో పాటు ఏడాదిన్నర వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేసిన దిలీప్, ప్రస్తుతం చికెన్ స్టాల్ లో పనిచేస్తున్నాడు.
