Site icon NTV Telugu

Kerala: కేరళలో లోకల్ పోల్స్‌లో బీజేపీ సంచలనం.. “రాజధాని” కైవసం..

Ani

Ani

Kerala: వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ, ఈ ఎన్నికలకు ముందే అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)కు ఎదురుదెబ్బ తగిలింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ముందంజలో ఉంది. ఆరు మున్సిపల్ సంస్థలలో నాలుగింటిలో మరియు 14 జిల్లా పరిషత్‌లలో కాంగ్రెస్ ముందుంది. వామపక్ష ఎల్డీఎఫ్ మాత్రం ఆరింటిలోనే ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లకు కంచుకోటగా ఉన్న కేరళలో కమలం వికసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని 101 మంది సభ్యులున్న మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 స్థానాలను గెలుచుకుంది. ఈ రేంజ్లో మెజారిటీ సాధించడం ఇదే తొలిసారి. బీజేపీ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకని ఉనికి చాటింది. ఇప్పుడు రాజధానినే కైవసం చేసుకుంది. మరోవైపు, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల కాలంలో బీజేపీకి దగ్గరవుతున్న సందర్భంలో ఈ ఫలితాలు వచ్చాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో వామపక్షానిదే హవా, కానీ ఈ సారి మాత్రం ఫలితాలు తారుమారయ్యాయి.

Read Also: Fire Accident: గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల ఆస్తి నష్టం

గతంలో ఈ కార్పొరేషన్‌లో 100 స్థానాల్లో సీపీఎం కు 51, బీజేపీకి 35, కాంగ్రెస్ కూటమికి 10 సీట్లు ఉండేవి. ఇప్పుడు సీట్ల సంఖ్య 101కి పెరిగాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు, సీపీఎం కూటమికి 29, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి 19 సీట్లు వచ్చాయి. మరో రెండు స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఈ గెలుపుపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఇది చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది బీజేపీ కార్యకర్తల కఠోర శ్రమకు నిదర్శమని అన్నారు. బీజేపీని గెలిపించిన తిరువనంతపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉంటే, బీజేపీ గెలుపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ తిరువనంతపురంలో బీజేపీ సాధించిన చారిత్రాత్మక పనితీరును కూడా నేను గుర్తించాలనుకుంటున్నాను. నగర కార్పొరేషన్‌లో వారి గణనీయమైన విజయానికి నా వినయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను – ఇది రాజధాని రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన మార్పును సూచించే బలమైన ప్రదర్శన. 45 సంవత్సరాల ఎల్‌డిఎఫ్ దుర్పరిపాలన నుండి మార్పు కోసం నేను ప్రచారం చేశాను, కానీ ఓటర్లు చివరికి పాలనలో స్పష్టమైన మార్పును కోరుకున్న మరో పార్టీకి బహుమతిగా ఇచ్చారు,’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Exit mobile version