Lottery Tickets: కేరళలో లాటరీలు కొంతమందికి కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. ఇటీవల కేరళలో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అతడికి రూ.25 కోట్ల లాటరీ తగిలింది. అయితే అందరినీ అలాంటి అదృష్టం వరించదు. నాణేనికి బొమ్మ ఉన్నట్లే బొరుసు కూడా ఉంటుంది. నాణేనికి మరోవైపు పరిశీలిస్తే లాటరీ టిక్కెట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కష్టాలు పడే వాళ్లు కూడా ఉన్నారు. కేరళలోనే మరో వ్యక్తి 52 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉన్నాడు. అయితే ఇప్పటివరకు అతడు ఎంత గెలిచాడో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు.
కన్నౌర్‌కు చెందిన రాఘవన్ తనకు ఏదో రోజు లాటరీ తగులుతుందన్న నమ్మకంతో 52ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. రోజూ కూలీ పనులకు వెళ్తూ సంపాదించిన డబ్బులలో కొంతమొత్తాన్ని లాటరీ టిక్కెట్లకే ఖర్చు పెడుతున్నాడు. అలా రాఘవన్ రోజుకు పది లాటరీ టికెట్ల చొప్పున కొనుగోలు చేస్తున్నాడు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.3 కోట్ల50 లక్షలు ఖర్చు చేశాడు.
Read Also:ఏ వయసులో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యానికి మంచిది?
అయితే ఇప్పటివరకు లాటరీల్లో రాఘవన్ గెలుచుకున్న అత్యధిక బహుమతి 5వేల రూపాయలు మాత్రమే. కేరళలో అత్యంత ఖరీదైన ఓనమ్ బంపర్ లాటరీని కూడా అతడు కొనుగోలు చేశాడు. ఈ టికెట్లన్నీ భద్రంగా గోనె సంచుల్లో నిల్వ చేసి అదృష్టం కోసం వేచి చూస్తున్నాడు. కాగా ఇటీవల తిరువనంతపురానికి చెందిన ఆటోడ్రైవర్ అనూప్ ఓనమ్ లాటరీలో రూ.25 కోట్ల బంపర్ బహుమతి సొంతం చేసుకున్నాడు. అయితే అతడు అనుకోకుండా ఓనమ్ బంపర్ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. శనివారం టికెట్ కొన్న అతడికి ఆదివారమే భారీ జాక్‌పాట్ తగిలింది. శనివారం టికెట్ కొనేందుకు వెళ్లిన అతడు.. తొలుత వేరే టికెట్ తీసుకున్నాడు. కానీ తర్వాత ఆ టికెట్ వెనక్కి ఇచ్చేసి ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు అదే టికెట్ అతడికి రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది.
