కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దీనిపై ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్ల భద్రతపై చర్యలు తీసుకోవాలని వైద్యులు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల నేపథ్యంలో తాజాగా కేరళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలేజీల్లో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఆడిట్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్వహణ ఎలా ఉందనేది పరిశీలిస్తారు. స్పేస్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Bala Veeranjaneya Swamy: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి..
మాక్‌డ్రిల్స్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాకీటాకీల వినియోగం, అనుమతి లేనివారికి రాత్రివేళ ఆస్పత్రిలో ఉండేందుకు నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇవే కాకుండా రాత్రిపూట డ్యూటీ ముగించుకొని వెళ్లే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వీధి కుక్కల దాడుల నుంచి సిబ్బంది, విజిటర్స్‌ను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం సాయంతో తగిన ప్రణాళికలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు.
ఇది కూడా చదవండి: AP Vision Document-2047: ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్..
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అలాగే మంగళవారం నిందితుడు సంజయ్ రాయ్ అనుచరుడిని కూడా దర్యాప్తు సంస్థ విచారించింది. ఇతడి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
