NTV Telugu Site icon

Man-Eating Tiger: “మ్యాన్ ఈటర్” పులి కోసం వేట.. చంపేందుకు సిద్ధమైన ప్రభుత్వం..

Man Eating Tiger

Man Eating Tiger

Man-Eating Tiger: మనిషి మాంసానికి మరిగిన పులి కోసం కేరళ ప్రభుత్వం వేట సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం వయనాడ్‌లో ఒక వ్యక్తిని చంపిన పులి కోసం కేరళ అటవీ అధికారులు వెతుకుతున్నారు. మ్యాన్ ఈటన్ పులిని 13 ఏళ్ల మగపులిగా గుర్తించినట్లు కేరళ అటవీ శాఖ మంత్రి ఎకే శశీంద్రన్ తెలిపారు. మ్యాన్ ఈటర్‌గా మారిన పులిని కాల్చి చంపేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Read Also: MPs suspended: పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెండ్.. జాబితాలో మాణికం ఠాగూర్, కనిమొళిలు

డిసెంబర్ 9న వాకేరి వాసి ప్రజీష్‌ని పులి హతమార్చింది. అతని సగం మృతదేహాన్ని కల్పెట్టాలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. పశువులకు మేత సేకరిస్తున్న సమయంలో పులి అతడిని చంపి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పులి మనిషి మాంసానికి అలవాటు పడటంతో కాల్చి చంపేయాలని స్థానికులు కోరడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

పులిని కాల్చివేయాలని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆదేశాలు జారీ చేశారని, ఆపరేషన్ కోసం సిద్ధం చేసిన 25 కెమెరాలు, రెండు బోనులతో జంతువుపై తీవ్ర నిఘా ఉంచామని శశీంద్రన్ తెలిపారు. ఈ ప్రాంతంలోని షూటర్లు, వైద్యులతో పాటు ఐదు గస్తీ బృందాలు ఉన్నాయని, ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. పులిని పట్టుకోవడం సాధ్యం కాని పక్షంలో దానిని చంపాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని కేరళ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. శశీంద్రన్ హైకోర్టు తీర్పును స్వాగతించారు.