కేరళలో ఓ వింత జబ్బు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా లేదంటే మెదడును తినే అమీబాగా పిలుస్తున్నారు. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ముక్కు ద్వారా మెదడులోకి వెళ్లి దాన్ని పూర్తిగా తినేస్తోంది. దీనివల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీని వ్యాప్తిని గుర్తించడం కష్టతరంగా మారింది. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. వ్యాధి సోకితే ఏం చేయాలి.. వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు కేరళ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కేరళలో “మెదడును తినే అమీబా” కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అమీబాను నైగ్లేరియా ఫౌలెరీ అని పిలుస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకు కేరళలో 69 కేసులు నమోదయ్యాయి. ఇందులో 19 మంది మరణించారు. ఈ వ్యాధికి గురైన వారిలో మూడు నెలల పసికందు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకూ ఉన్నారు. కేవలం ఈ నెలలోనే ఇప్పటివరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కోజికోడ్, మలప్పురం, తిరువనంతపురం తదితర జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు చివరలో కోజికోడ్‌లో 3 నెలల శిశువు ప్రాణాలు కోల్పోయారు. తిరువనంతపురంలోని ఓ టూరిస్ట్ విలేజ్ స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసిన 17 ఏళ్ల బాలుడికి కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తోందనేది అధికారులకు అంతు చిక్కట్లేదు. ఒకే వాటర్ సోర్స్ నుంచి ఈ కేసులు నమోదయ్యాయని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అయితే ఆ సోర్స్ ఎలా వ్యాపించిందనేది అంతు చిక్కట్లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోగం వస్తే చనిపోయే వాళ్ల సంఖ్య 97 శాతం ఉంటుంది. అయితే కేరళలో అది 24 శాతం మాత్రమే ఉంది. ఇదొక్కటే కాస్త ఆశాజనకంగా ఉంది.
అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. దీనికి కారణమయ్యే అమీబా గురించి ఇప్పుడు చూద్దాం. నెగ్లేరియా ఫౌలెరి అనేది ఫ్రీ-లివింగ్ అమీబా. అంటే సహజంగా జీవించే ఒక సూక్ష్మజీవి. ఇది వెచ్చని తాజా నీటి మూలాల్లో నివసిస్తుంది. అంటే చెరువులు, కాలువలు, వాగులు, నదులు లాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువ క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్‌లో కూడా ఉంటుంది. ఇది సహజంగా 25 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో బాగా పెరుగుతుంది. ఇది మనిషి శరీరంలోకి నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది. అమీబా ముక్కులోకి వెళ్ళిన తర్వాత, అది వాసన నాడి ద్వారా మెదడుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి మెదడు కణజాలాన్ని వేగంగా నాశనం చేస్తుంది. ఇది ప్రాణాంతకమైన “ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ -PAM” అనే మెదడు ఇన్‌ఫెక్షన్కు కారణమవుతుంది.
బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి కాదు. దశాబ్దాలుగా ఈ వ్యాధి సోకుతూనే ఉంది. అయితే ఏడాది మాత్రం ఈ వ్యాధి విజృంభిస్తోంది. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రపంచంలో మొదటి PAM కేసు 1965లో ఆస్ట్రేలియాలో నమోదయ్యింది. 1965 నుంచి 2018 వరకు 381 కేసులు మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. భారతదేశంలో మొదటి కేసు 1971లో నమోదయ్యింది. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొన్ని కేసులు వచ్చాయి. 2016లో తొలి మరణం కేరళలోని అలప్పుజాలో నమోదైంది. 2023 నుంచి కేసులు కాస్త పెరుగుతున్నాయి. 2024లో 36 కేసులు నమోదు కాగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదైతే ఇది విజృంభిస్తోంది. ఒక్క కేరళలోనే ఈ ఏడాది 69 కేసులు నమోదయ్యాయి. కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కేవలం 20 కేసులే వెలుగుచూశాయి. కేరళలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. కేరళలోని వాతావరణ మార్పులు, కాలుష్యం లాంటివి కేసులు పెరగడానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కేరళలో చాలాచోట్ల నీరు నిల్వ ఉంటుంది. ఇవి అమీబా పెరగడానికి అనుకూలంగా ఉంటాయి.
PAM వ్యాధి లక్షణాలు చాలా నార్మల్ గా ఉంటాయి. మనకు తెలీకుండానే మన శరీరంలోకి అమీబా వెళ్లిపోతుంది. వ్యాధి లక్షణాలపై అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అమీబా శరీరంలోకి ప్రవేశించిన 1 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం లాంటివి మొదట్లో కనిపిస్తాయి. ఇవి సాధారణ మెనింజైటిస్ లేదా ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. దీంతో సాధారణ జలుబు, జ్వరమే కదా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ గందరగోళం, మూర్ఛలు, సమన్వయం కోల్పోవడం, కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత చాలా సందర్భాలలో 1 నుండి 18 రోజుల్లో మరణం సంభవిస్తుంది. కాబట్టి వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
మెదడు తినే అమీబా వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వ్యాధి నుంచి సురక్షితంగా బయటపడొచ్చు. ఇది ప్రాణాంతక వ్యాధి. కాబట్టి ఈ వ్యాధిబారిన పడకుండా జాగ్రత్తపడాలి. నిలిచి ఉన్న నదులు, సరస్సులు, చెరువులలో స్నానం చేయడం, ఈత కొట్టడం మానుకోవాలి. ఈత కొట్టేటప్పుడు, నీరు ముక్కులోకి వెళ్లకుండా నోస్ క్లిప్స్ ఉపయోగించాలి. ముక్కును శుభ్రం చేసుకోవడానికి క్లోరినేట్ చేసిన లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఇంటికి సమీపంలో ఉన్న బావులు, నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా క్లోరినేట్ చేయాలి. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది అమీబా ఇన్ఫెక్షన్ కావచ్చునని గుర్తించి చికిత్స ప్రారంభించాలి. ఈ వ్యాధి చాలా అరుదుగా ఉన్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైనది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఆరోగ్య శాఖ సూచనలను పాటించడం చాలా ముఖ్యం.
ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేకపోవడం పెద్ద సమస్య. అందుకే వ్యాధిబారిన పడకుండా జాగ్రత్తపడడం ఒక్కటే మార్గం. ఈ రోగానికి పూర్తి చికిత్స లేదు. కానీ మిల్టెఫోసిన్ అనే యాంటీ-పారాసిటిక్ డ్రగ్, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌తో ట్రీట్‌మెంట్ ఇస్తారు. కేరళలో PCR టెస్టులు, జెనోమిక్ సీక్వెన్సింగ్‌తో ఎర్లీ డిటెక్షన్ చేస్తున్నారు. ఇది మరణాల రేటును గణనీయంగా తగ్గించగలుగుతోంది. అయితే ముందుగా గుర్తించినప్పుడే ఇది సాధ్యం. ఆలస్యం చేస్తే మాత్రం ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అందుకే ముందస్తు డయాగ్నోసిస్ చాలా కీలకం.
కేరళలో అమీబా కేసుల పెరుగుదల చాలా ఆందోళనకరంగా మారింది. దీనిబారిన పడకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒక్కటే. నిల్వ ఉన్న నీటికుంటలు, చెరువులు, నదుల్లో స్నానాలు చేయకపోవడమే.! ఒకవేళ మీకు ఈ వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.