NTV Telugu Site icon

Raghav Chadha: కేజ్రీవాల్‌ని జైలులో వేసి, 7 సీట్లు గెలవండి.. ఆప్ నేత విమర్శలు..

Raghav Chadha

Raghav Chadha

Raghav Chadha: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(ఆప్) అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ లిక్కర్ కేసులో సమన్లు జారీ చేసింది. దీంతో ఆప్ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆప్ నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై మండిపడ్డారు. కేజ్రీవాల్‌ని బీజేపీ ఏజెన్సీలు అరెస్ట్ చేయబోతున్నాయని ఆరోపించారు.

ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి, ఇండియా కూటమి ఇక్కడ పోటీ చేస్తే ఢిల్లీలోని ఏడు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని అందరికి తెలుసు. దీంతో అధికార పక్షం భయపడి, ప్రతిపక్షాలను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల్లో మొదటగా అరవింద్ కేజ్రీవాల్ నే టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శించారు.

Read Also: Yogi Adityanath: “తాలిబాన్‌లకు బజరంగ్‌బలి” పరిష్కారం.. యోగీ సంచలన వ్యాఖ్యలు..

అరవింద్ కేజ్రీవాల్ ని జైలులో వేసి, 7 సీట్లను జేబులో వేసుకోవాలనేదే బీజేపీ ప్లాన్ అని రాఘవ్ చద్దా అన్నారు. బీజేపీ తదుపరి టార్గెట్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అని అన్నారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయనకు ప్రజాదరణ పెరిగిందని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జార్ఖండ్‌లోని 19 సీట్లలో 14 గెలుచుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో 4 సీట్లను కూడా గెలవదని ఆయన జోస్యం చెప్పారు. అందుకే బీజేపీ ఆయన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని అన్నారు.

వీరే కాకుండా బీహార్ లో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇలా బీజేపీ టార్గె్ట్ చేస్తుందని మండిపడ్డారు. ఇండియా కూటమిలోని అగ్రనేతల్ని కటకటాల వెనక్కి నెట్టితే, బీజేపీ మాత్రమే రేసులో ఉంటుందని, గెలుస్తుందని చద్దా అన్నారు. ఇదే బీజేపీ వ్యూహమని ఆయన ఆరోపించారు.

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా సీఎం కేజ్రీవాల్ కి సమన్లు జారీ చేసింది. ఆయను ప్రశ్నించిన తర్వాత నవంబర్ 2న అరెస్ట్ చేస్తుందని ఆప్ ఆరోస్తోంది. అయితే ఈ కేసులో గతంలో సీబీఐ కేజ్రీవాల్ ని ప్రశ్నించింది.