Site icon NTV Telugu

Kashmir: కాశ్మీరు లోయలో.. కనీ వినీ ఎరగని రీతిలో..

Kashmir

Kashmir

Kashmir: ప్రకృతి సౌందర్యానికి, మంచు అందాలకు నిలయమైన కాశ్మీర్‌ భారతదేశపు స్వర్గభూమిగా పేరొందింది. అందుకే పర్యాటకులు అక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే గత మూడేళ్లుగా కరోనా, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో సందర్శకులు కాశ్మీర్‌ లోయకు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రికార్డు స్థాయిలో ప్రజలు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సంఖ్య కనీ వినీ ఎరగని రీతిలో 20 లక్షలకు పైగా నమోదు కావటం విశేషం. గతంలో మహాఅయితే 15-16 లక్షల మందే వచ్చేవాళ్లు. ఈ సంవత్సరం మాత్రం 8 నెలల్లోనే 2 మిలియన్ల మార్క్‌ని దాటింది.

ఇది ‘ఆల్‌ టైం హై’ అని స్థానికులు తెలిపారు. ఆగస్టు చివరి నాటికి కాశ్మీర్‌ను సందర్శించినవారి సంఖ్య 20.49 లక్షలని చెప్పారు. ఇందులో 10,500 మంది విదేశీయులు కాగా 3.65 లక్షల మంది అమర్‌నాథ్‌ యాత్రికులు. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలు ఉండటంతో టూరిస్టుల సంఖ్య సరికొత్త చరిత్రను నెలకొల్పుతుందని చెబుతున్నారు. అనూహ్య రీతిలో సందర్శకులు రావటంతో కాశ్మీర్‌ లోయతోపాటు శ్రీనగర్‌, పహల్‌గామ్‌, గుల్‌మార్గ్‌, సోనామార్గ్‌ వంటి టూరిస్ట్‌ డెస్టినేషన్లన్నీ వంద శాతం ఆక్యుపెన్సీని సాధించాయి. శ్రీనగర్‌లోని హౌజ్‌ బోట్లు 70-80 శాతం నిండాయి. ఈ నేపథ్యంలో ట్రావెల్‌ ఏజెంట్లు, హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఓనర్లు హర్షం వ్యక్తం చేశారు.

Kunamneni Sambasiva Rao: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక

తమ జీవితంలో ఇంత మంది సందర్శకులను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాశ్మీర్‌కి పర్యాటకులు క్యూ కట్టడంతో బసకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఖాళీ ఇళ్లలో, టెంట్లతో ఏర్పాటుచేసిన గుడారాల్లో వసతి కల్పించేందుకు అనుమతించింది. కాశ్మీర్‌కి విమానం టికెట్‌ రేటు రూ.4000 నుంచి రూ.5000 లోపు ఉండటం, శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌కి ఫ్లైట్ల సంఖ్య పెరగటం, ఆతిథ్య సేవలు అందుబాటులో ఉండటం, భద్రతాపరంగా సందర్శకులకు సురక్షిత వాతావరణం నెలకొనటం వంటి కారణాల వల్ల పర్యాటకులు ఊహించనిరీతిలో వస్తున్నారని ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కాశ్మీర్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ తెలిపారు.

ఆగస్టులో కాశ్మీర్‌కి వచ్చిన టూరిస్టుల సంఖ్య తగ్గినప్పటికీ పండగ సీజన్‌ నేపథ్యంలో ట్రావెలర్ల సంఖ్య పెరగనుందని కాశ్మీర్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఓనర్స్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ చెప్పారు. టూరిజం ఇండస్ట్రీలో తనకు దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉందని, ‘ది బెస్ట్‌’ సీజన్‌ అంటే ఇదేనని పేర్కొన్నారు. ఈ ఏడాది కాశ్మీర్‌కి వచ్చిన పర్యాటకుల సంఖ్య నెలల వారీగా ఇలా ఉంది.. జనవరిలో 62 వేల 600, ఫిబ్రవరిలో లక్ష చిల్లర, మార్చిలో లక్షా 80 వేలు, ఏప్రిల్‌లో 2 లక్షల 72 వేలు, మేలో 3 లక్షల 75 వేలు, జూన్‌లో 3 లక్షల 33 వేలు, జులైలో 2 లక్షల 7 వేలు, ఆగస్టులో లక్షా 54 వేల 900.

Exit mobile version