UP Elections: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మొదట్లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలు ప్రభావితం చేసేలా ఉంటాయి. దీంతో దేశవ్యాప్తంగా యూపీలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, యూపీలో మాత్రం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన, రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని కర్ణిసేన జాతీయాధ్యక్షుడు సూరజ్‌పాల్ సింగ్ అమ్మూ ప్రకటించారు.
క్షత్రియ ఓట్లపై కర్ణిసేన గురి..
రాజ్‌పుత్ లేదా ఠాకూర్‌లు యూపీ ఎన్నికల్లో కీలక వర్గంగా ఉంది. 50 నుంచి 70 స్థానాలు వీరు ప్రభావితం చేస్తారు. గతంలో యూపీకి ఐదుగురు సీఎంలు ఠాకూర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. 15-25 శాతం వరకు రాజ్‌పుత్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు అమ్మూ చెప్పారు. అగ్రవర్ణాల సమస్యలు, రిజర్వేషన్లు, ఓబీసీ అంశాలపై మాట్లాడుతామని చెప్పారు. ఇప్పటికే ఎస్‌బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్‌తో అమ్మూ భేటీ అయ్యారు.
అసలు సవాల్ బీజేపీకే.. ఎస్పీకి లాభమా?
ఉత్తర్ ప్రదేశ్‌లో కర్ణిసేన పోటీ బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అగ్రవర్ణాలు బీజేపీకి ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. ఇప్పుడు కర్ణిసేన పోటీ చేస్తే ఈ ఓట్ బ్యాంక్‌పై ప్రభావం పడుతుంది. ఇదే సమయంలో అగ్రవర్ణ ఓట్లలో చీలిక ఏర్పడితే ఇది ఎస్పీ-కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పీడీఏ(వెనకబడిన, దళిత, ఆదివాసీ) నినాదంతో ముందుకు వెళ్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫార్ములాతోనే ఎస్పీ 37 లోక్‌సభ సీట్లను గెలుచుకుంటే, బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు అగ్రవర్ణ ఓటర్లలో ఒక వేళ చీలిక ఏర్పడితే ఇది అంతిమంగా బీజేపీకి నష్టం చేకూర్చి, ఎస్పీకి లాభమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

