Karnataka: పోలీస్ ఉన్నతాధికారులు, న్యాయ శాఖ నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను పట్టించుకోకుండా కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించింది. 2022లో జరిగిన ‘‘హుబ్బళ్లీ అల్లర్ల’’కు సంబంధించిన కేసును ఉపసంహరించుకుంది. ఈ కేసు ఉపసంహరణ ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుందని పోలీసులు, న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు అధికారిక పత్రాలు సూచించాయి.
ఓల్డ్ హుబ్బళ్లీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో అల్లర్ల సమయంలో స్టేషన్‌ని ధ్వంసం చేశారు. నిందితుల్లో ఒకరైన ఎంఐఎం కార్పొరేటర్, నిరసన కోసం జనాన్ని హింసకు ప్రేరేపించాడనే ఆరోపణతో ఏప్రిల్ 23, 2024న అరెస్టు చేశారు. పోలీసుల రికార్డ్ ప్రకారం.. అభిషేక్ హిరేమత్ అనే వ్యక్తి మసీదుపై కాషాయ జెండాను కలిగి ఉన్న సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసిన తర్వాత, ఏప్రిల్ 16, 2022న అల్లర్లు జరిగాయి.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుని విత్ డ్రా చేసుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్టోబర్ 05, 2023న డీజీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు విత్ డ్రా చేసుకోవడం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు ఆజ్యం పోస్తుందని, పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ కేసు ఇప్పటికే కోర్టులో విచారణలో ఉందని, విత్ డ్రా చేసుకోవద్దని లేఖ రాశారు. న్యాయశాఖ కూడా ఈ చర్యల్ని వ్యతిరేకించింది. ఈ కేసుని విత్ డ్రా చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణం లేదని పేర్కొంది. అయితే, ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ఈ కేసుని సిద్ధరామయ్య ప్రభుత్వం హుటాహుటీన ఉపసంహరించుకుందింది. కేబినెట్ ఆమోదం నుంచి అన్ని రకాల విత్ డ్రా పేపర్స్ కేవలం రెండున్నర నెలల్లోనే పూర్తయ్యాయి.
2022 ఓల్డ్ హుబ్బళ్లి అల్లర్లు ఏప్రిల్ 16న జరిగాయి, ఒక ముస్లిం గుంపు సోషల్ మీడియా అవమానకరమైన పోస్ట్‌ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వెలుపల గుమిగూడింది. నిరసన హింసాత్మకంగా మారింది, అల్లర్లు పోలీసు వాహనాలు మరియు ప్రజా ఆస్తులను ధ్వంసం చేశాయి. రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. అక్టోబర్ 10,2024న రాష్ట్రవ్యాప్తంగా 43 కేసుల్ని ఉపసంహరించుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందులో హుబ్బళ్లీ కేసు కూడా ఉంది.
డిసెంబర్ 6, 2024న, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) కేసును ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఉపసంహరణ దరఖాస్తును డిసెంబర్ 24, 2024న సిటీ సివిల్, NIA కోర్టులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 321 కింద దాఖలు చేశారు. అయితే, ప్రభుత్వం ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకుంటుందనే విషయాన్ని దరఖాస్తులో వివరించలేదు. ఈ కేసు ఇప్పుడు ఏప్రిల్ 7, 2025న విచారణకు రానుంది. అల్లర్లకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకునే చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)ను కర్ణాటక హైకోర్టులో విచారణకు రానుంది.