Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

  • కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ‘వందేమాతరం’లో తొలి రెండు చరణాలే పాడాలి
  • కర్ణాటక ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
Dksivakumar

Dksivakumar

‘వందేమాతరం’ జాతీయ గీతం విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ గీతాన్ని పాడే సమయంలో ఏకరూపత, గౌరవం, సరైన ప్రోటోకాల్‌ పాటించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది.

కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన కన్నడ ఉత్తర్వుల అనువాదం ప్రకారం.. కేంద్ర హోంశాఖ ‘వందేమాతరం’ అధికారిక వెర్షన్‌, ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాల్లో దాని గానం లేదా ప్రదర్శనకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపింది. అయితే రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల స్వభావం, సందర్భానికి అనుగుణంగా గీతాన్ని పాడే విషయంలో ఏకరూపత, గౌరవం, సరైన ప్రోటోకాల్‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

తొలి రెండు చరణాలకే పరిమితం

కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ‘వందేమాతరం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో జాతీయవాదం, ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ నిర్ణయం రాజకీయంగా మరోసారి చర్చకు దారితీసే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ అధికారిక కార్యక్రమాల్లో పూర్తి ‘వందేమాతరం’ పాడాలని ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కేంద్రం నిర్ణయానికి భిన్నంగా కాంగ్రెస్‌ వైఖరి

డీకే శివకుమార్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. ‘వందేమాతరం’పై కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకున్న వైఖరికి అనుగుణంగా ఉందని భావిస్తున్నారు. గత నెలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937లో తీసుకున్న తీర్మానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నేతల సమక్షంలో తీసుకున్నదని కాంగ్రెస్‌ చెబుతోంది.

పూర్తి వందేమాతరం తప్పనిసరి చేసిన కేంద్రం

ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమావేశాల్లో పూర్తి ‘వందేమాతరం’ పాడటాన్ని తప్పనిసరి చేసింది. జాతీయ గీతం ఆలపించడాన్ని అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం నేరంగా పరిగణించేలా పార్లమెంట్‌లో బిల్లును కూడా ప్రవేశపెట్టింది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 1937లో కాంగ్రెస్ అగ్రనేతలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామని పేర్కొంది.

‘అసంపూర్తి వందేమాతరం’పై ఖర్గేకు విమర్శలు

ఆగస్టులో గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘వందేమాతరం’ పూర్తి వెర్షన్‌ను పాడలేదంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దీనికి ఖర్గే స్పందిస్తూ.. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తదితరులు పాడిన వెర్షన్‌నే తాను పాడానని చెప్పారు. అదే వెర్షన్‌ను పాడటం నేరమైతే, ఆ నేతలపై కూడా కేసులు నమోదు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

‘వందేమాతరం’ చరిత్ర ఇదీ..

‘వందేమాతరం’ను ప్రముఖ రచయిత బంకించంద్ర ఛటర్జీ తన ‘ఆనందమఠం’ నవలలో రచించారు. 1896లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారి వందేమాతరాన్ని ఆలపించారు. అయితే ఆ తర్వాత ముస్లిం లీగ్ నాయకులు ఈ గీతంలోని హిందూ దేవతల ప్రస్తావనలను అభ్యంతరకరంగా పేర్కొంటూ వ్యతిరేకించారు. దీంతో 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై.. వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించింది. ప్రస్తుతం కేంద్రం, కాంగ్రెస్‌ వైఖరులు భిన్నంగా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి రాజకీయ చర్చకు తెరతీసే అవకాశం ఉంది.