Site icon NTV Telugu

Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు..

Yediyurappa

Yediyurappa

Yediyurappa: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్పకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని కర్ణాటక పోలీసు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) నుంచి నోటీసులు వచ్చాయి. 17 ఏళ్ల మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది ప్రారంభంలో కేసు నమోదైంది. చీటింగ్ కేసులో సాయం కోసం ఫిబ్రవరి 2న యడియూరప్ప సాయం కోసం వెళ్లిన సందర్భంలో తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు.

Read Also: United Kingdom: మా డిమాండ్లకు మద్దతిచ్చిన వారికే ఓట్లు.. బ్రిటన్ లో మేనిఫెస్టో విడుదల చేసిన హిందువులు

యడియూరప్పపై పోక్సో యాక్ట్‌తో పాటు ఐపీసీలోని సెక్షన్ 354(ఏ) కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యడియూరప్ప తన న్యాయవాదుల ద్వారా సీఐడీ ముందు హాజరు కావడానికి ఒక వారం పొడగింపు కావాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే విచారణ బృందం మూడుసార్లు విచారించింది, ప్రస్తుతం ఆయన నాలుగోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది.

తొలుత సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి విచారణ కోసం సీఐడీకి బదిలీ చేశారు. అయితే, యడియూరప్ప మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు. నిరాధారమైనవిగా పేర్కొన్నారు. 81 ఏళ్ల యడియూరప్ప కర్ణాటక బీజేపీలో సీనియర్ నేత. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2008-2011 మధ్య, 2018లో కొంత కాలం, మళ్లీ జూలై 2019-2021 వరకు సీఎంగా పనిచేశారు. 2021లో సీఎంగా రాజీనామా చేశారు.

Exit mobile version