NTV Telugu Site icon

Umesh Katti: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మృతి

Umesh Katti

Umesh Katti

Karnataka Minister Umesh Katti dies of cardiac arrest: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం మరణించారు. గుండె పోటు కారణంగా బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. 61 ఏళ్ల ఉమేష్ కత్తి బస్వరాజ్ బొమ్మై మంత్రి వర్గంలో పౌరసరఫరాలు, అటవీ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్టు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమేష్ కత్తి. బెంగళూర్ లో డాలర్స్ కాలనీలో ఉన్న తన నివాసంలో బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయిన ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఉమేష్ కత్తి పల్స్ పడిపోయింది. దీంతో ఆయన మరణించినట్లుగా డాక్టర్లు ప్రకటించారు.

Read Also: Nitin Gadkari: సీటు బెల్టు పెట్టుకోకుంటే జరిమానా.. సైరస్ మిస్త్రీ మరణం తర్వాత కీలక నిర్ణయం

ఉమేష్ కత్తి మరణంపై ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నమ్మకమైన ప్రజా సేవకుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బెలగావి జిల్లాలో కీలక నేతగా ఉన్న ఉమేష్ కత్తి మరణం.. జిల్లా బీజేపీకి తీవ్ర లోటు అని రెవెన్యూ మంత్రి ఆర్ అశోక అన్నారు. ఉమేష్ కత్తి మరణ వార్త తెలిసిన వెంటనే మంత్రులు గోవింద్ కార్జోల్, కే. సుధాకర్ పలువురు బీజేపీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం సిద్ధరామయ్య సంతాపం తెలియజేశారు. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు.

1985లో రాజకీయాల్లోకి వచ్చారు ఉమేష్ కత్తి. బెళగావి జిల్లా హుక్కేరి తాలుకాలోని బెల్లడబాగేవాడిలో జన్మించిన ఆయన 1985లో తండ్రి విశ్వనాథ్ కత్తి మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2008లో బీజేపీలో చేరడానికి ముందు జనతాపార్టీ, జనతాదళ్, జేడీయూ, జేడీఎస్ పార్టీల్లో పనిచేవారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడ్యూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. గతంలో ఉత్తర కర్ణాటక ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని ఉమేష్ కత్తి డిమాండ్ చేశారు.