NTV Telugu Site icon

Lottery: జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. రూ.25 కోట్ల లాటరీ గెలిచిన అల్తాఫ్

Lottery

Lottery

చాలా మంది అప్పుడప్పుడు కష్టాలొచ్చినప్పుడు ఏదైనా లాటరీ తగిలితే బాగుండును బాధలన్నీ తీరిపోతాయని అనుకుంటారు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలా అనుకోవడం సహజమే. కానీ అదే నిజమైంది ఓ కుటుంబానికి. లక్ష కాదు.. రెండు లక్షల కాదు.. ఏకంగా రూ.25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయారు.

కర్ణాటకకు చెందిన స్కూటర్‌ మెకానిక్‌ అల్తాఫ్‌ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్‌ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడి దగ్గరకు అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్‌ ప్రతిసారీ అక్కడ లాటరీ టికెట్‌ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్‌ వయనాడ్‌ జిల్లా సుల్తాన్‌ బాతెరీలో రూ.500 పెట్టి రెండు టికెట్లు కొనుగోలు చేశాడు. ఇలా 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఈ ఏడాది కూడా ఫ్రెండ్ ద్వారా రెండు టికెట్లు రూ.500 చొప్పున కొనుగోలు చేశాడు. ఓ టికెట్ స్నేహితునికి ఇవ్వాలనుకున్నాడు. కానీ భార్య అడ్డుకుంది. అదే టికెట్‌కు అదృష్టం వరిస్తుందేమో అని చెప్పడంతో ఆగిపోయాడు. అర్ధాంగి అడ్డుకున్నట్టుగానే ఆ టికెట్ రూ.25 కోట్ల బహుమతి గెలుచుకుంది. దీంతో ఎగిరి గంతులేశారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్‌ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్‌ కొన్న టీజీ 43422 నంబర్‌ టిక్కెట్‌ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్‌ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు ఫోన్‌ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ‘‘మహాయుతి’’లో లుకలుకలు.. కేబినెట్ నిర్ణయాలపై అజిత్ పవార్ అసంతృప్తి..

లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్‌ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్‌ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు. బెంగళూరులో సెటిలవుతానని.. తన కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నట్లు చెప్పాడు. అప్పులన్నీ తీర్చేస్తానని అల్తాఫ్‌ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్‌ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Devara: దేవర కలెక్షన్స్.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

Show comments