బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో బయల్దేరిన కర్ణాటక ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం అయ్యారు. ఈ నెల 20న అదృశ్యం అయినట్లుగా మంత్రి ప్రియాంక్ ఖర్గే శనివారం తెలిపారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వంగానీ.. కుటుంబ సభ్యులుగానీ ఎక్కడా కూడా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఇక ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ సంఘటనను అధికారికంగాధృవీకరించారు. ఐఏఎస్ అధికారి అదృశ్యమైనట్లు సమాచారం అందినప్పటికీ.. కుటుంబ సభ్యుల తరఫున ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు. ఢిల్లీకి వెళ్లేందుకు విమానంలో సిద్ధమవుతుండగా అతడిని చివరిసారిగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చూశారని కూడా ఖర్గే పేర్కొన్నారు. జ్ఞానేంద్ర కుమార్ ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
జ్ఞానేంద్ర కుమార్ 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కొద్దికాలం పాటు పరీక్షల కంట్రోలర్‌గా కూడా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. ప్రస్తుతం కొందరు ఆయన అదృశ్యానికి కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి కచ్చితమైన సమాచారం వెలువడలేదు. అయితే కొన్ని రోజుల క్రితం వెటర్నరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపించబడిన కుంభకోణానికి సంబంధించి కేపీఎస్‌సీ సభ్యురాలు శాంతా హోస్మానీ, మరికొందరి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించింది. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యమైనట్లు సమాచారం.

