NTV Telugu Site icon

Siddaramaiah: ముడా కేసులో సీఎంకు చుక్కెదురు.. దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు హైకోర్టు ఆదేశం

Siddaramaiah

Siddaramaiah

కనుమ పండుగ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. లోకాయుక్త దర్యాప్తులో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటూ పిటిషనర్ స్నేహమయి కృష్ణ అనే కార్యకర్త కోరారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపు అవకతవకలపై విచారణ కొనసాగించేందుకు కర్ణాటక హైకోర్టు బుధవారం లోకాయుక్తకు అనుమతినిచ్చింది.

ఇది కూడా చదవండి: Sanjjanaa : ఆ కన్నడ హీరో పట్టుకుని పిసికేశాడు.. బుజ్జిగాడు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

విచారణను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, లోకాయుక్త పర్యవేక్షించాలని కోర్టు సూచించింది. ఇక జనవరి 27లోగా లోకాయుక్త నుంచి నివేదికను కోరింది. ఇప్పటి వరకు సేకరించిన అన్ని పత్రాలను తదుపరి విచారణకు ఒక రోజు ముందు సమర్పించాలని లోకాయుక్తను కోరింది. ఇక సిద్ధరామయ్యకు సంబంధించిన ముడా కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను జనవరి 27కు హైకోర్టు వాయిదా వేసింది.

ముడా స్కామ్ ఇదే..
మైసూర్‌లోని ప్రధాన ప్రాంతాల అభివృద్ధికి తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించారు. ఈ ప్రక్రియలో అర్హులైన వారి కంటే.. మిగతా వారు లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా ముడా స్కామ్ బయటకు వచ్చింది. ఇందులో సిద్ధరామయ్య భార్యకు ఖరీదైన ఆస్తులు కూడా బెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రక్రియ 50:50 పథకం కింద జరిగింది. దీనిని నవంబర్ 2020లో ప్రవేశపెట్టారు. 2023లో సిద్ధరామయ్య రద్దు చేశారు. సిద్దరామయ్య భార్య పార్వతికి 2022లో విజయనగరంలో నిబంధనలకు విరుద్ధంగా 14 ప్రీమియం సైట్లు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. మైసూరులోని కేసరు గ్రామంలోని 3.16 ఎకరాల భూమిని 2005లో సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున్ స్వామికి బదలాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణ ప్రారంభం కాగానే సిద్ధరామయ్య భార్య ప్లాట్లను తిరిగి ముడాకు అప్పగించారు.

Show comments