Karnataka: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ కారకాలు ఒంట్లోకి చేరుతాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వ్యాఖ్యలు చేసిన తర్వాత, కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. రాష్ట్రవ్యాప్తంగా 52 హోటళ్లలో ఇడ్లీలు తయారు చేయడానికి పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నారని కర్ణాటక ఆహార భద్రతా విభాగం కనుగొన్నట్లు మంత్రి దినేష్ గుండూ రావు గురువారం తెలిపారు.
Read Also: Mamata Banerjee: ‘‘ఆట మళ్లీ మొదలైంది’’.. బీజేపీకి మమతా బెనర్జీ వార్నింగ్..
ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 250 రకాల ఇడ్లీ నమూనాలను పరీక్షించిందని, వీటిలో మామూలుగా వాడే వస్త్రానికి బదులుగా ఇడ్లీను చేసేటప్పుడు ప్లాస్టిక్‌తో కప్పుతున్నట్లు నిర్ధారించారని మంత్రి చెప్పారు. ‘‘ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 251 నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. గతంలో, ఇడ్లీ వండేటప్పుడు వస్త్రాన్ని ఉపయోగించేవారు.ఈ రోజుల్లో కొన్ని చోట్ల వస్త్రానికి బదులుగా ప్లాస్టిక్ వాడుతున్నారని మాకు సమాచారం అందింది’’ అని ఆయన మీడియాతో చెప్పారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ కారకాలు ఇడ్లీలోకి చేరుతాయని, ఇలాంటి పనులు చేయవద్దని మంత్రి సూచించారు. 251 శాంపిళ్లను పరీక్షిస్తే 52 శాంపిళ్లలో ప్లాస్టిక్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఇది జరగకుండా చూసుకోవడానికి ఆరోగ్య శాఖ త్వరలోనే అధికారిక ఆదేశాలు జారీ చేస్తుందని, నియమాలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.