కాంగ్రెస్ పార్టీలో ఐదు రాష్ట్రాల ఓటమి తాలూకు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామాకు అధిష్టానం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, జీ-23 రెబల్స్ అధిష్టానంపై గుగ్లీలు విసురుతూనే ఉన్నారు.
ఇది ఇలావుంటే, రెబల్ నేతగా ముద్రపడిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అతి త్వరలో సోనియా గాంధీని కలవనున్నారు. ఈ భేటీలో రాహుల్, ప్రియాంక కూడా పాల్గొంటారని సమాచారం. జీ-23 సభ్యుల ఆఖరి ప్రతిపాదనలను ఈ సందర్భంగా సోనియాకు అందచేస్తారని తెలుస్తోంది. తాజా ఘోర పరాభవం తరువాత కూడా గాంధీ కుటుంబ సభ్యులు పార్టీ పదవులలో కొనసాగటం రెబల్ నేతలకు అసలే ఇష్టం లేదు.
కాంగ్రెస్ బాగా బలహీన పడిన వేళ ఇంటి పోరు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కొంత కాలంగా అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న జీ-23 నేతలకు తాజా ఓటమి అవకాశంగా మారింది. ఈ క్రమంలోనే పార్టీ ఎంపీ మనీశ్ తివారీ పంజాబ్ కాంగ్రెస్ తీరును మరోసారి ఎండగట్టాడు. ఇటీవల ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల మనీశ్ తివారీ ధన్యవాదాలు తెలిపారు. గతేడాది చన్నీ ప్రమాణ స్వీకారానికి తనను ఆహ్వానించలేదని ఇప్పుడు గుర్తుచేశారు. పంజాబ్‌కు చెందిన మనీశ్ తివారీ కాంగ్రెస్ రెబల్ గ్రూప్ జీ-23 నేతల్లో ఒకరు.
మరో రెబల్ నేత కపిల్ సిబల్ మళ్లీ అధిష్టానంపై బాణాలు ఎక్కుపెట్టారు. పార్టీ అధ్యక్షుడు కాని రాహుల్ గాంధీ ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఏ అధికారంతో పంజాబ్ సీఎంగా ప్రకటించారని ప్రశ్నించారు. ఇకనైనా నాయకత్వ మార్పునకు గాంధీ ఫ్యామిలీ నడుం బిగించాలని సూచించారు. అయితే, కపిల్ సిబల్ తీరుపై సొంత పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనను మంత్రిని చేసింది కూడా సోనియా గాంధీ అనే సంగతి గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీలు నాయకత్వ బాధ్యత నుంచి తప్పుకుంటే పార్టీ ముక్కలు చెక్కలవుతుందని, బీజేపీ, ఆరెస్సెస్ కూడా అదే కోరుకుంటోందని అంటున్నారు. కొందరైతే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
రెబల్స్ చెబుతున్న దానిలో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేగంగా దిగజారుతోంది. పుంజుకుంటున్న సూచనలు కనిపించటం లేదు. దశాబ్దాల పాటు గాంధీ-నెహ్రూ కుటుంబానికి కోటలా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో హస్తం పార్టీకి ఇప్పుడు కనీసం మూడు శాతం ఓట్లు కూడా లేవు.
80 లోక్‌సభ స్థానాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రం యూపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు నేతలు దేశ ప్రధానులయ్యారు. గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ సొంత రాష్ట్రం ఇది. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ 397 సీట్లలో పోటీ చేసింది..కానీ 385 సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇంతకు మించిన ఘోర పరాజయం ఉంటుందా.
రాష్ట్ర ఎన్నికల బాధ్యతలను పూర్తిగా తనపై వేసుకున్న ప్రియాంక గాంధీ 200కు పైగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ‘లడ్కీ హు.. లడ్ సక్తి హు’ నినాదంతో మహిళల ఆకట్టుకున్నారు. కానీ ఓటు హస్తానికి వేయలేదు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. పైగా ఇంకా దిగజారిందని ఫలితాలు రుజువు చేశాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 6.22 శాతం ఓట్లతో 7 సీట్లు సాధించింది. కానీ ఈసారి 2.33 శాతం ఓట్లు, రెండు సీట్లు వచ్చాయి. గాంధీల కంచుకోటలు రాయ్‌బరేలీ, అమేథీ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదు. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ప్రియాంక మీద ఆశలు పెట్టుకున్న క్యాడర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.
కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి హైకమాండ్ నిర్ణయాలే చాలా వరకు కారణం. ఐనా గాంధీ ఫ్యామిలీని అడిగే సాహసం సీడబ్ల్యూసీ సభ్యులు చేయలేరు. కారణం వారిని గాంధీ ఫ్యామిలీయే నియమించింది. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనూ అదే జరిగింది. ఎక్కువ మంది గాంధీ కుటుంబానికి విధేయత తెలిపారు. అన్ని అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తరువాత చింతన శిభిరం నిర్వహించనుంది. ఈ సమావేశంలో గాంధీ ఫ్యామిలీ- రెబల్స్ మధ్య తాడో పేడో తేలిపోవచ్చు. ఏఐసీసీలో ఇప్పటికీ మెజార్టీ సభ్యులు గాంధీల పక్కనే ఉన్నారు. గాంధీలు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటే పార్టీలో చీలిక తప్పదనేది వారి భయం.
కేంద్రంలో అధికారం కోల్పోయిన తరువాత కాంగ్రెస్‌లో ఏటేటా బలహీన పడుతూ వస్తోంది. గత ఎనిమిదేళ్లలో ఆ పార్టీ కేవలం ఐదు ఎన్నికల్లో మాత్రమే గెలిచి నలబైకి పైగా ఎన్నికల్లో ఓడిపోయింది. మరోవైపు ప్రాంతీయ ఆప్, తృణమూల్ పార్టీలు కాంగ్రెస్ ఓట్లకు గండికొట్టే పనిలో ఉన్నాయి. కనుక, ఇప్పట్లో హస్తానికిపూర్వ వైభవం దాదాపు అసంభవం. ఈ ఏడాది చివరలో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు కాంగ్రెస్‌కు కఠిన పరీక్ష కానున్నాయి. ఈ లోగా పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.