Kanwar Yatra: శివ భక్తుల కన్వరియాల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. శివ భక్తులతో యాత్రకు వెళుతున్న బస్సు విద్యుత్ ఘాతానికి గురైంది. బస్సులో ఉన్న వారిలో ఐదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. బస్సుకు హైటెన్షన్ వైర్లు తగలడంతో బస్సులో ఉన్న శివ భక్తుల్లో అక్కడికక్కడే ఒకరు మరణించగా.. చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దక్షిణ ఉత్తరప్రదేశ్‌లోని మిరట్ జిల్లా, భవాన్‌పురీ రాలీ చౌహాన్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Tamilnadu: మీ కోరికలు వెంటనే తీరాలంటే ఈ గుడికి ఒక్కసారి వెళ్ళాల్సిందే..!
శివుని భక్తులుగా పేరుగాంచిన కన్వరియాలు యాత్రకు వెళ్లారు. హరిద్వార్‌లో గంగాజలంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు.. భవాన్‌పురీ గ్రామానికి చేరుకోగానే కిందికి వంగి ఉన్న హై టెన్షన్ వైర్‌లకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో బస్సులో ఉన్న యాత్రికులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అప్రమత్తమైన గ్రామస్తులు విద‍్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ సరఫరాను నిలిపివేయించారు. కానీ అప్పటికే ప్రమాదం తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనకు బాధ్యత వహించాలంటూ నిరసన చేపట్టారు. హై టెన్షన్ వైర్లు కిందికి ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా సరిచేయలేదని ఆవేదన వ‍్యక్తం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. కన్వార్ యాత్ర భారతదేశంలో అతిపెద్ద మతపరమైన యాత్రల్లో ఒకటి. ప్రతీ ఏడాది ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, చంఢీగర్, ఒడిశా, జార్ఖండ్ నుంచి కోటీ ఇరవై లక్షల మంది భక్తులు హాజరవుతారు. కన్వారియాలు కాశాయ వస్ర్తాలు ధరించి చెప్పులు లేకుండా యాత్రకు వెళతారు.