బెంగళూరులో కన్నడ టీవీ నటి నందిని సీఎం (26) ఆత్మహత్య చేసుకుంది. కెంగేరిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో నందిని సీఎం బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. కెంగేరి పోలీసులు BNSS చట్టం, 2023లోని సెక్షన్ 194 కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 28, 2025 రాత్రి 11:16 గంటల నుంచి డిసెంబర్ 29, 2025 అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కెంగేరిలోని పీజీ హాస్టల్‌లోని రెండవ అంతస్తులో ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చదవండి: Khaleda Zia: బంగ్లాదేశ్‌లో విషాదం.. మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఎఫ్ఐఆర్ ప్రకారం… నందిని 2018లో బళ్లారిలో పీయూసీ విద్యను పూర్తి చేసింది. తర్వాత హెసరఘట్టలోని ఆర్ఆర్ ఇన్స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ కోర్సులో చేరింది. అయితే నటనపై ఆసక్తి ఉండడంతో రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లడం మానేసింది. రాజరాజేశ్వరి నగర్‌లో నటనపై శిక్షణ పొందింది. 2019 నుంచి అనేక కన్నడ టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. ఆగస్టు 2025లో బెంగళూరులోని కెంగేరిలో పీజీ వసతి గృహానికి మారింది. 2023లో తండ్రి మరణం తర్వాత నందినికి కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ.. నటనపై ఆసక్తి ఉండడంతో ఉద్యోగాన్ని వదులుకుంది. దీంతో కుటుంబంలో విభేదాలు కూడా తలెత్తాయి.
ఇది కూడా చదవండి: OTR: మోనార్క్ ఎమ్మెల్యే.. టైం వస్తుందంటున్న మైనారిటీలు!
ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఇష్టంలేదని, నటన కొనసాగించాలనే కోరికను వ్యక్తం చేస్తూ నందిని తన డైరీలో రాసుకుంది. కుటుంబ సభ్యులు తన భావాలను అర్థం చేసుకోవడం లేదని వాపోయింది. ఇక నందిని మరణం విషయంలో ఎవరిపైనా తమకు ఎటువంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కెంగేరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నందిని.. కన్నడ, తమిళ సీరియల్స్‌లో నటించింది. తమిళంలో నటించిన గౌరి సీరియల్‌తో మంచి పాపులర్ అయ్యారు. ఆ సీరియల్‌లో కనకదుర్గ పాత్రలో డబుల్ రోల్ చేశారు. నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక కన్నడలో జీవా హూవాగిడే, సంఘర్ష, మధుమగలు , నీనాదే నా వంటి అనేక ప్రముఖ కన్నడ టెలివిజన్ సీరియల్స్‌లో సహాయక పాత్రల్లో నటించింది.
