NTV Telugu Site icon

Uddhav Thackeray: ‘మహా’ సంక్షోభానికి ఆ ఇద్దరు మహిళల శాపనార్ధాలే కారణమా..?

Kangana Ranut, Uddhav, Navaneet

Kangana Ranut, Uddhav, Navaneet

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి పతనం అంచున ఉంది. శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండేతో ఏకంగా 35 శివసేన ఎమ్మెల్యేలు ఉండటంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే వారంతా తమకు ప్రస్తుతం ప్రభుత్వంపై నమ్మకం లేదని చెబుతూ.. శివసేన, బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయం ఇదే అయితే తాము కూటమి నుంచి వైదొలుగుతామని ఎంపీ సంజయ్ రౌత్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మెల్యేలంతా గౌహతి నుంచి ముంబై వచ్చి సీఎంతో మాట్లాడాలని సూచించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో శివసేన కూటమి కుప్పకూలిపోయే పరిస్థితికి ఆ ఇద్దరు మహిళలే కారణం అంటూ.. వారు పెట్టిన శాపనార్థాలే కారణం అని చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కాగా.. మరొకరు అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. గతంలో పలు సందర్భాల్లో ఈ ఇద్దరు సీఎం ఉద్దవ్ ఠాక్రేను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని శాపనార్థాలు కూడా పెట్టారు.

గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పలు విమర్శలు చేశారు. ముంబై నగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా తయారైందని విమర్శించారు. ఈ వ్యాఖ్యల మధ్య కంగనా రనౌత్ మణికర్ణిక కార్యాలయాన్ని ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. ఆ సమయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేను టార్గెట్ చేస్తూ కంగనా కీలక కామెంట్లు చేశారు. “ఆజ్ మేరా ఘర్ టూతా హై. కల్ తేరా ఘమండ్ టూటేగా” ( ఈ రోజు నా ఇంటిని కూల్చేశారు.. రేపు మీ గర్వం కూలుతుంది) అని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో జరగుతున్న రాజకీయ పరిణామాల మధ్య సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసం వర్ష బంగ్లా నుంచి సొంత ఇళ్లు ‘మాతో శ్రీ’కి మారడంతో కంగనా రనౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం నడిచింది. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కూడా ఉద్ధవ్ ఠాక్రేను విమర్శించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇళ్లు ‘మాతోశ్రీ’ ముందు హనుమాన్ చాలీస్ చదువుతామని నవీనత్ కౌర్, ఆమె భర్త రవి రాణా సవాల్ విసరడం.. ఆ తరువాత ప్రభుత్వం వీరిద్దరిని అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ కు పంపారు. ఆ సమయంలో నవనీత్ కౌర్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే భగవాన్ హనుమాన్ కోపాన్ని చవిచూస్తారని హెచ్చరించింది. దీంతో మహాసర్కార్ కుప్పకూలే దిశగా సాగుతుండటంతో ఈ ఇద్దరు మహిళల వ్యాఖ్యలు తెగవైరల్ అవుతున్నాయి.