ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్ ఢిల్లీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు రాజీనామా లేఖను పంపించారు. ఇటీవలే కైలాష్ గహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అతిషి కేబినెట్‌లో కైలాష్ గహ్లోత్ మంత్రిగా ఉన్నారు. అనూహ్యంగా ఉన్నట్టుండి మంత్రి పదవికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే హఠాత్తుగా ఆప్‌ను వీడడంపై విమర్శలు రావడంతో.. తన నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన విలువలకు, నైతికతకు దూరమైందని ఆరోపించారు.
నవంబర్ 17న మంత్రి పదవికి రాజీనామా చేశానని.. అదే రోజు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రధాన విలువలు, నైతికతకు దూరమైందని గుర్తుచేశారు. బుధవారం తన శాసనసభా సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు రిజైన్ లెటర్‌లో కైలాస్ గహ్లాత్ పేర్కొన్నారు.
ఢిల్లీలో జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ జైలుకెళ్లారు. ఆరు నెలల జైలు అనంతరం బెయిల్‌పై ఇంటికి వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ పీఠంపై అతిషిని కూర్చోబెట్టారు. ప్రజలు విశ్వసించే వరకు సీఎం సీటులో కూర్చోనని కేజ్రీవాల్ తెలిపారు. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కేజ్రీవాల ఇప్పటికే ప్రకటించారు. 11 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. ఛతర్‌పూర్, కిరారీ, విశ్వాస్ నగర్, రోహతాష్ నగర్, లక్ష్మీనగర్, బదర్‌పూర్, సీలంపూర్, సీమాపురి, ఘోండా, కరవాల్ నగర్, మటియాల నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2020లో ఆప్ 70 స్థానాలకు గాను 62 స్థానాలను గెలుచుకుంది.