Annamalai: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెర లేవబోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తన పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసినట్లు సమాచారం. తాను ఇటీవల
స్టార్ట్ చేసిన ‘వి ది లీడర్స్’ (We The Leaders) ప్రచారం సరైన దిశలో సాగుతోందని, వచ్చే జూలై నెలలోనే ఇది పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందబోతోందని ఆయన అధికారికంగా ప్రకటించారు. సాంప్రదాయ, వారసత్వ రాజకీయాలకు ఎండ్ కార్డ్ వేస్తూ సరికొత్త విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారని తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

అన్నామలై సరికొత్త విప్లవం

వారసత్వ – శాశ్వత రాజకీయాలపై అన్నామలై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సొంత పార్టీ ఏర్పడిన తర్వాత నాయకుల పదవీకాలానికి స్పష్టమైన ‘పరిమితులు’ (Term Limits) విధించే ఆలోచనను పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయాల్లో పాతవారి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవారికి అవకాశం లభించడం చాలా కీలకం. ఏ ఒక్కరికీ కుర్చీ శాశ్వతం కాకూడదు” అని స్పష్టంగా చెప్పారు. అమెరికా, లండన్ వంటి విదేశాలలో అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్న సమర్థులైన తమిళ వృత్తి నిపుణులు, సాంకేతిక నిపుణులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని, వారికి తమ పార్టీ ఒక పటిష్టమైన వేదికగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

×
×
Ad

50 లక్షల టార్గెట్..

ఒక సోషల్ మీడియా వేదికపై జరిగిన సంభాషణలో అన్నామలై తన భవిష్యత్తు కార్యాచరణను పంచుకున్నారు. తమ సంస్థలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ఈ ఉద్యమంలో 50 లక్షల మంది సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఎలాంటి అంచనాలు లేకుండా ఇప్పటికే 18 లక్షల మంది ప్రచారంలో భాగస్వాములయ్యారని చెప్పారు. తమ కార్యకర్తలు కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా, నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను సంప్రదిస్తూ సభ్యత్వ నమోదును ముమ్మరం చేస్తున్నారని వెల్లడించారు. తమిళనాడు ప్రజలు మార్పును బలంగా ఆశిస్తున్నారని, ఈ చొరవ రాష్ట్ర రాజకీయాలకు సరికొత్త దిశానిర్దేశం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

జూలై నుంచి రూపురేఖలు మారనున్నాయి..

తమ సంస్థ ప్రజలను ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుదోవ పట్టించదని, పూర్తి పారదర్శకతతో పనిచేస్తుందని అన్నామలై స్పష్టం చేశారు. తమ దృష్టిలో అన్ని మతాలు సంపూర్ణంగా సమానమేనని, ఎలాంటి వివక్షాపూరిత ఓటు బ్యాంక్ రాజకీయాలకు తమ సంస్థ పూర్తిగా దూరంగా ఉంటుందని తేల్చి చెప్పారు. తమిళనాడు యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ వ్యసన సమస్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి, నగరానికి ఈ సమస్యను తీసుకువెళ్తూ భారీ ప్రజా అవగాహన ఉద్యమాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న ‘వి ది లీడర్స్’, జూలై నెల నుంచి పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా మారిన తర్వాత తమిళనాడు రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మార్చబోతోందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.