Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి నివాళులర్పించారు. భారతదేశానికి తమ సంతాపాన్ని తెలిపారు. ‘‘ప్రజాసేవకుడు, వినయపూర్వకమైన వ్యక్తి’’ అని బైడెన్ కొనియాడారు. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సహకారం కోసం వ్యూహాత్మక దృష్టి, రాజకీయ ధైర్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. ‘‘భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేరనే బాధలో ఉన్న భారతదేశ ప్రజలతో నేను, జిల్ కలిసి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికతను మేం గుర్తు చేసుకుంటున్నాము. జిల్, నేను మాజీ ప్రధాని భార్య గురుశరణ్ కౌర్, వారి ముగ్గురి పిల్లకు, భారత ప్రజలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము’’ అని జోబైడెన్ ప్రకటనను వైట్‌హౌజ్ విడుదల చేసింది.
Read Also: Jeevan Reddy: కేంద్రం మన్మోహన్ సింగ్‌ను భారత రత్నతో గౌరవించాలి..
భారతదేశానికి రెండు సార్లు ప్రధానిగా చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో గురువారం రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించారు. ఆయన మరణంపై జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యూహాత్మక దృక్పథం, రాజకీయ ధైర్యం లేకుండా ఈరోజు అమెరికా, బారత్ మధ్య అపూర్వ స్థాయి సహకారం సాధ్యమయ్యేది కాదు’’ అని ఆయన అన్నారు. యూఎస్-ఇండియా పౌర అణు ఒప్పందం, ఇండో-పసిఫిక్ భాగస్వాముల మధ్య మొదటి క్వాడ్‌ని ప్రారంభించడంలో ఆయన సాయం మరవలేనిదని కొనియాడారు. 2008లో సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్‌గా, 2009లో వైస్ ప్రెసిడెంట్‌గా మన్మోహన్ సింగ్‌ని కలిసే అవకాశం లభించిందని జో బైడెన్ చెప్పారు. 2013లో న్యూఢిల్లీలో తనకు ఆతిథ్యం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.
