NTV Telugu Site icon

Terrorist Attack: రియాసి బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులకు పూంచ్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌ దాడితో సంబంధం..

Riasi

Riasi

Terrorist Attack: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసే రోజే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లో రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పులతో బస్సు నియంత్రణ తప్పి, సమీపంలోని లోయలో పడిపోయింది. ఈ దాడిలో 09 మంది మరణించారు. ఈ దాడిలో ‘జింగిల్ వార్‌ఫేర్’లో శిక్షణ పొందిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గుహల్లో దాక్కుంటూ, ఎం4 కార్బైన్ గన్స్ వాడుతూ వీరు దాడులకు పాల్పడుతున్నారు.

రియాసి బస్సు దాడి ఘటనకు మే 4న పూంచ్‌లో భారతవైమానిక దళం(ఐఏఎఫ్) కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సంఘటనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే రియాసిలో బస్సుపై దాడికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. పూంచ్ అటాక్ తర్వాత టెర్రరిస్టులు అడవుల గుండా ప్రయాణించారు.

Read Also: Uddhav Thackeray: కాంగ్రెస్, శరద్ పవార్‌పై విమర్శలు.. ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ ప్రశంసలు..

దాడికి పాల్పడుతున్న ఉగ్రవాదులు అడవుల్లోని గుహల్లో రోజుల తరబడి నివసిస్తూ, దాడులకు పాల్పడేలా శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. రియాసి ఘటన తర్వాత భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించింది. ఐదు భద్రతా సంస్థలు ఈ సంఘటనలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజౌరి, రియాసి, పూంచ్ అనే మూడు జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) బాధ్యత వహించింది. ఆ తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ మరియు రియాసి ఆసుపత్రులలో క్షతగాత్రులను పరామర్శించారు మరియు భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. రియాసి ఉగ్రదాడి ఘటనలో మృతుల కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ రూ. 10 లక్షల రూపాలయ ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందచేయనున్నారు.