Site icon NTV Telugu

JEE Mains : నేటి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు

Jee Main 2022

Jee Main 2022

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 29 వరకు నేష‌నల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎ‌న్టీఏ) పరీ‌క్షలను నిర్వహిస్తున్నది. రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా మంది విద్యా‌ర్థులు హాజ‌రు‌కా‌ను‌న్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరుగనున్నాయి. రెండో విడుత జేఈఈ మెయిన్ పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, జేఈఈ మెయి‌న్‌కు హాజ‌రయ్యే విద్యా‌ర్థు‌లను సొంత మాస్క్‌తో పరీక్ష కేంద్రా‌ల్లోకి అను‌మ‌తించేది లేదని, పరీక్ష కేంద్రాల్లో ఉచి‌తంగా మాస్క్‌ను అందిస్తామని అధికారులు వెల్లడించారు.

గతేడాది మాస్క్‌ను ధరించి ఒక‌రికి బదు‌లుగా ఒకరు పరీక్ష రాస్తూ పట్టు‌బ‌డిన నేపథ్యంలో ఎ‌న్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యా‌ర్థులు తమ వెంట 2 పాస్‌‌పోర్ట్‌ సైజు ఫొటో‌లను తీసు‌కురావాలని ఎన్టీఏ సూచించింది. వాటిని ఏదేని ఐడీ ఫ్రూఫ్‌తో సరి‌పో‌ల్చి చూస్తామని పేర్కొన్నారు అధికారులు. గుర్తింపు కార్డు‌లుగా ఒరి‌జి‌నల్‌ పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌‌పోర్ట్‌, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, 12వ తర‌గతి అడ్మి‌ట్‌‌కా‌ర్డుల్లో ఒక దాన్ని ఐడీ కార్డులుగా పరిగణించనున్నట్లు ఎన్టీఏ అధికారులు పేర్కొన్నారు. దేశంలోని 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 29 జీఎఫ్​టీఐల్లోని సుమారు 40వేల ఇంజినీరింగ్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా భర్తీ చేస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లోని దాదాపు 13వేల ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షకు అర్హులను జేఈఈ మెయిన్ ద్వారా ఖరారు చేస్తారు.

 

 

Exit mobile version